పుట:కాశీమజిలీకథలు-12.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమావతి కథ

41

మొసఁగుచున్న యవసరమున నా నిశాచరుండు వారి సన్నిధికేతెంచి తీక్ష్ణముగా నిట్ల నియె.

ఓరోరి దుర్మదాంధులారా ! పాపశంక లేక పరనారినిఁ జేరదీయుటకు మీ రొనర్చు ప్రయత్నములు నా ముందు సాగనేరవని యెరుంగుడు. ఇది నా భార్య. నవ యౌవనముచేఁ జెన్ను మీరియున్న మీ రూపములకు వశంవదయై యిప్పుడీ కులట మీ సన్నిధి కేతెంచినది. దీనిని సత్వరమ విడిచిపెట్టకున్న నా యాగ్రహమునకు పాత్రు లగుదురు.

మణిగ్రీవుడు - [నవ్వుచు] ఏమి ! ఈమె నీ భార్యయ్యా? నీవీమెకుఁదగిన భర్తవే? మీ దాంపత్యము చాల ముచ్చటఁగొలుపు చున్నది.

రక్కసుఁడు - అట్ల నుచుంటివేమి ? నేనీమెకుఁ దగననియా నీయభి ప్రాయము.

మణి - కాదు. కాదు. ఆమె సౌంధర్యముననుఁ దగిన యందగాఁడవు నీ వొక్కడవే. మిమ్ముఁ గూర్చినవారి నభినందింప వలసియున్నది.

హేమా -- నేను వీని భార్యను గాను. నన్నీ దురాత్ముండు బలాత్కార ముగా నపహరించి యిచ్చటికిఁ దెచ్చి తన్గలయ రమ్మని నిర్భంధించుచున్నాఁడు. ఇంతలో దైవము మిమ్మిందు బంపెను. అనాధను రక్షింపుఁడు.

జలంథరుఁడు -- సుందరీ ! భయపడకుము. మా కంఠముల జీవములున్నంత వఱకు నీ రక్కసుఁడు నీ నీడనైనఁ ద్రొక్కజాలఁడని యెరుంగుము.

మణి - [రాక్షసునితో] మ్రుచ్చువై యిమ్మచ్చకంటిం గొనివచ్చి భార్య యని బొంకెదవేమిరా ?

రక్క --- మే మిచ్చటకు వచ్చిన పిమ్మటనే యీమె నాకు భార్యయైనది. ఈమె సర్వస్వమునకు నన్నే నాయకునిఁగా నింతకు ముందే నిర్ణయించి మీరు గనం బడిన తోడనే యిట్లు బొంకుచున్నది. స్త్రీచిత్తము క్షణక్షణమునకును మారుచుండు ననుట కిది తార్కాణము. ఎట్లయిన నీమె నే విడువను. దేవతల నిర్జించి వారి స్థాన మును మేమాక్రమించుకొంటిమి.‌ పరాక్రమోసార్జితయగు నీ సీమంతిని నా స్వత్వ మైనది. దీనిని విడువుఁడు. లే దేని మిమ్ముఁ దగురీతిని శిక్షింపక మానను. అని యీ రీతి వారికి వాదోపవాదములు జరిగి క్రమక్రమముగా ద్వంద్వయుద్ధమునకుఁ గడంగిరి. వారిపోరు ఘోరమై హేమావతికి భయవిషాద జనకమయ్యెను. ఎంత బలము గలవాని కైన నిరువురతో పోరువు కష్టము గదా ? ఇరువురు యక్షకుమారులు నవవయస్కులు. బలపరాక్రమో పేతులు, మీదు మిక్కిలి రణ విద్యా విశారదులు. ఇన్నిటికన్న వెక్కు డుగ హేమావతికిఁ బ్రియ మొనర్చి యామె మెప్పువడయుటయే తమ జీవత పరమా వధి యని తలంచిన యా యౌవనపురుషుల తెంపరితనమే యా రాత్రించరుని నిర్వీ