పుట:కాశీమజిలీకథలు-11.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము

మంచికథ పొడకట్టునేమో తెలిసికొని యెరింగింతురే ! దేవరకుగాక యిందలిరహస్య మొరులకు దెలియగలదా ! అని యడిగిన విని యయ్యతిపతి యిట్లనియె.

గోపా! వేళమిగిలినది. నీవు భుజింపుము. నీ వడిగిన ప్రశ్నము రిత్త బోవదు. అందు విచిత్రకధా ప్రాచుర్య మేదియో యుండకపోవదు. అనుటయు నుబ్బుచు గొబ్బునవాడు సాపడివచ్చి యొజ్జల యడుగులం బట్టుచు స్వామీ! కుడిచి వచ్చితిని. తదుదంత మాకలించుకొంటిరా ? విశేష చమత్కారము లేమైన నిందు గలవా? అని యడిగిన నవ్వుచు నవ్విద్వాంసు డిట్ల నియె.

వత్సా! నే ననలేదా, నీవు తొల్లింటి‌ పుట్టువున జాల పున్నెముసేసి యే కారణమునో గోపుండవై పొడమితివి. నీ‌ యంతఃపురమునకు దైవసాన్నిధ్యము కలదు. నీవు చొప్పదంటుంజూచి యడిగినను గొప్పకథ గలిగియుండును. ఈ సమస్యార్థము విచిత్రకథా సందర్భముల నొప్పారుచున్నది. సావధానుండవై యాకర్ణింపుము.

అగ్నిశిఖునికథ

తొల్లి భోజనృపాల పాలితంబగు ధారానగరంబున నగ్నిశిఖుండను పాఱుండు దేవదత్తయను భార్యతో గాపురము సేయుచుండెను. అతండు వేద వేదాంగముల సాంతముగా దెలిసికొని తదుక్త ధర్మంబుల యధావిధిం గావింపుచు శ్రోత్రియుండని ప్రఖ్యాతి వడసెను. మరియు నున్నదానితో సంతుష్టినొంది యొరుల యాచింప నిష్టములేనివాడగుట యాగంబులు సంపూర్ణదక్షణాత్యాగంబునం గాని సుకృతోపయోగంబులుగావని వానియం దాదరము వహింపడయ్యెను

నిత్య కర్మానుష్టానములయందు శ్రద్దవహించి ధర్మశాస్త్రముల బరిశీలింపు చుండును. పూర్వాచారముల నాదరించి నూత్నా చారముల నాక్షేపించుచుండ నతనిని ఛాందసుడని జనులు పరిహాసమాడుచుందురు. ఆ ప్రోల భోజభూపాలుండు కవి దివిజపాలుండై లక్షలకొలది పండితులకు విత్త మిచ్చుచున్నను నా భూసురుం డెన్నడు నతనికడ కరిగియెరుగడు. సంతతము విద్యార్థులకు స్వాధ్యాయము చెప్పుచుండును. అనర్హు లని యెవ్వరింటికిం గుడువబోడు. అరగువిడిచి పొరుగింటికరుగ నెరుగడు.

అతనిభార్య దేవదత్త యరుంధతికి తప్పులు దిద్దునది. స్వాధ్యాయా ధ్యాపనమున కంతరాయము గలుగునని భర్తను గృహకృత్యముల విషయమై యెన్నడు నియమింపదు. కావలసిన సంభారము లన్నియు విద్యార్థులచే దెప్పించి కుటుంబయాత్ర గడుపుచుండును.

ఒకనా డామె కౌశికుండను నంతేవాసింజీరి, యోరీ! మీ యయ్యగారికి ఛాందసము దిన దినాభివృద్ధి వహించుచున్నది. వారి తండ్రిగారి యాబ్దికము నాలుగు దినములలో రానున్నది. ధర్మశాస్త్రములలో జెప్పిన ప్రకారము భోక్తల