300
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
ధీశ్వరుండగు బోజుకుమారుని వరించితిని. మా తండ్రి న న్నానరదాధనందనున కిచ్చి వివాహముఁ జేయుటకు నిశ్చయించి శభలేఖలు వ్రాయునంతలో నాయన పిన తండ్రి రాజ్యలోభంబున నతనిం జంపించెనని వార్తవచ్చినది. అప్పుడు మా తండ్రి మరియొక రాచపట్టి కిచ్చుటకు నిశ్చయించెను. నా వార్త విని నేనొరు లెరుఁగకుండఁ బురుష వేషముతో బురముదాటిఁ తురగ యానంబున బయలుదేరి వచ్చితిని. మనోహరుండు స్వర్గస్థుఁ డయ్యెనని యెరింగినను నా మనం బాపురి కరుగుటకు లాగికొని వచ్చినది. నా సంకల్పముఁ దలంచికొనిన నాకే వింత యగుచున్నది. ఈ వర్తకుఁడు చెప్పిన మాటల వినుటచే నతండు బ్రతికియున్నాడేయో యనునాస జనించినది. మార్గము దప్పి మేమీ యరణ్యములోఁ బడితిమి. ఆటవికులఁ గొందరఁ జంపుటచేఁ బగఁ బూని పెక్కండ్రు వచ్చి మమ్మమ్మవారికి బలి యియ్య నిశ్చయించిరి. ఇంతలో దేవర వచ్చి విడిపించితిరి. ఇమ్మహారణ్య మధ్యమునకు హటాత్తుగా నరుదెంచి మాకుఁ బ్రాణము లొసంగిన దేవర కులశీల నామంబులు వినఁగోరుచుంటిమి. మీ బేరు రతనంపు పేరు వలె సంతతయు నెడఁద నిడుకొని యానందింతుమని యుక్త యుక్తముగాఁ బలికిన విని బోజుండు, ఆహా ! యేమి యీ వింత? నా చిత్రపట మీ కలికి తండ్రియొద్ద కనిపినవా రెవ్వరు ? బుద్ధి సాగరుఁడు కావలయును. అన్నన్నా ! ఈ చిన్నది యెంత సాహసముఁ జేసినది. నా నిమిత్తమెట్టి చిక్కులంబడినది. బళిరా! దైవనియోగము. ఈ యోషామణిని బట్టమహిషినిగా జేసికొననేని నరకముపాలై పోవకుందునా ? ఇట్టి పతివ్రత భార్యయయ్యెనేని మదీయ వంశ మంతయుఁ బవిత్రమగునని తలంచుచు నతండు మరియు నిట్లనియె.
తరుణీ ! మా కాపురము ధారాపురమే. భోజకుమారుని వార్త నేనును విని యుంటిని. పినతండ్రిచేఁ జంపింపఁబడెనని చెప్పుకొనిరి. అట్టి వానిం బెండ్లి యాడక మాటలచే నిశ్చయింపఁబడిన నీకు మరియొకనిం బెండ్లి యాడుట దోషము కాదు. మీ తండ్రిమాట యతిక్రమించి వచ్చుటయే దోషము అని చెప్పిన విని యప్పడఁతి యిట్లనియె.
ఆర్యా ? మనోవాక్కాయ కర్మంబులలో మనస్సే ప్రధానమని పెద్దలు చెప్పుదురు. మనసుచే నిశ్చయింపఁబడిన వరుని విడిచి మరియొకనిం బెండ్లి యాడుట తప్పని సావిత్రి చరిత్రమే చెప్పుచున్నది. మీది ధారానగరమంటిరి. బోజకుమారుండు నిక్కముగాఁ జంపఁబడెనా ? ప్రధానులు వరొక తెరవేదియు నాలోచింపలేదా ? అతం డట్టి యక్రమ కార్యముఁ జేయుచుండ సామంతులేల యూరకొనిరి ? పిమ్మట నా ముంజుండు పశ్చాత్తాపముఁ జెందెనని వింటిమే? తరువాత నేమి జరిగినదియో మీకుఁ దెలియదా ? యని యడిగిన నతండు చిరునగవుతో నేను మొదటి వార్త మాత్రమే వింటిని. పిమ్మట నేమయ్యెనో నాకుఁ దెలియదు. కృత కార్యానంతరము పశ్చాత్తాపము వలనం బ్రయోజన మేమి? యని యుత్తర మిచ్చెను.