Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సులోచన కథ

299

తలంచితిని. ఇరువురము గలసి వచ్చుచున్నప్పుడామె మా నగరప్రభువగు భోజకుమారుని వృత్తాంత మడుగుచు నాయన పినతండ్రిచేఁ జంపఁబడెనను వార్తవిని మిక్కిలి పరితపించనది. ఆయన కెద్దియో బంధుత్వము గలిగి యున్నదని తలంపవచ్చును. ఒక పల్లెలో నామె గుఱ్ఱమును దొంగలు తీసికొనిపోయిరి. అప్పుడు మేము పాదచారులమై పోవుచుండఁ గొండవాండ్రు కొందరడ్డమై మమ్ము బెదరించిరి. వారి నెల్లన్ నీ వారి జాక్షికౌక్షేయకదార కాహుతిఁ గావించినది.

అప్పుడీయడవివాండ్రెల్ల నాలోచించికొని మాకూ దెలియకుండ వెను వెంట వచ్చి యామె చేతనున్న కత్తిలాగికొనిరి. పిమ్మట నూర్గురు వచ్చి ముట్టడించి మమ్ముఁ బట్టికొని కట్టి యీ కొండదేవతకు బలియిచ్చుటకుఁ దీసికొనివచ్చిరి. అప్పుడీమె యాఁడదని తెలిసినది. ఈమె చేత గటారియే యున్నచో నెందరు వచ్చినను లక్ష్య పెట్టకపోవునని తమ వృత్తాంత మంతయు నా వర్తకుఁ డెరిఁగించెను.

ఆ వృత్తాంతము విని భోజుం డాశ్చర్యమందుచు నయ్యిందువదన గట్టిన చీరను విలోకింపుచున్నంత నక్కాంతారత్నము కన్నులు మూసికొని హా! భోజనరేంద్రా ? నేనుగూడ వచ్చి యింద్ర లోకములో నిన్నుఁ గలసికొనియెద. నన్నుఁ గురించి యించుకఁ దాళుము. అని పలవరించుటయు నతండు నౌరా ! ఇత్తలోదరి నన్నిట్లు స్మరించుటకుఁ గతఁబేమొకో ? నా పరిచయ మెచ్చట గలిగినది. తలంచికొన నెన్నఁడును నీ యన్ను మిన్నం గన్నది విన్నదియుఁ గూడ జ్ఞాపకము లేదు. ఈమె వలననే నిజముగాఁ దెలిసికొనియెదంగాక యని నిశ్చయించి యామెం బ్రబోధింపుమని యా వర్తకుని నియమించెను.

రత్న పాలుండు అమ్మా ! లెమ్ము లెమ్ము మనయిక్కట్టు లన్నియు నీ పుణ్యాత్ముడు వచ్చి విచ్చిన్నముఁ గావించెను. శత్రువులు కాందిశీకులైరని లేపిన నాపికవాణి యల్లన లేచి యెదురు నవమదనుండో యననొప్పుచున్న భోజకుమారుం గాంచి లజ్జభయ సంభ్రమములతో నించుకతొలగి తల వంచుకొనియీతం డెవ్వఁడొకో యని యాలోచించు చున్న సమయంబున బోజుం నిట్లనియె

సాధ్వీ ! నీతల్లిదండ్రు లెవ్వరు? నీ పేరేమి? ఎందుబోవుచుంటివి ? బోజుని స్మరించితి వతఁడు నీ కేమికావలయును? నీ వృత్తాంత మెరింగించి మా సందియములఁ బోకార్చుమని పలికిన నక్కలికి యొక్కింత చింతించియపాంగవిలోకనముల నతనిం జూచుచు నతనిరూప మెప్పుడో చూచినట్లు తలంచుచు నిట్లనియె

మహాత్మా ! ఆపత్కాలంబున వచ్చి ప్రాణదానముఁ గావించిన నీ వంటి యాప్తుండు మా కెవ్వరును లేరు నీ యొద్ద నిక్కము దాచిన పాతకము గదా? నేను బాహ్లీకుఁని కూఁతుర నా పేరు లీలావతి యండ్రు. మా తండ్రి నాకు వివాహ ప్రయత్నముఁ జేయుచుఁ బుడమియందు సుందరమునఁ బేరు పొందిన నృపనందుల చిత్ర ఫలకము లన్నియుఁ దెప్పించి నాకుఁ జూపెను. ఎవ్వరిని వరింపక నేను ధారానగరా