Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లీలావతి కథ

285

దిగంబరనై జలకమాడు నలవాటు బోటుల కెల్ల గలిగియన్నది. ఇది కడు ముప్పు దెచ్చినది దెసమొలతో నెక్కడికిఁ బోవుదును ? అయ్యో ? తలంచుకొన నా సంకల్ప మున్మత్త క్రియాకల్పమైనది. ఒరునిం బెండ్లి యాడ నిష్టము లేదని చెప్పిన బలవంతమునఁ గట్టిపెట్టుదురా యేమి? నే నీ సాహస‌ మేమిటికిఁ జేయవలయును? నా కీ యడవిలో మరణము విధి విధించెఁ గాబోలు ? హరిహర హిరణ్య గర్భులకైనను నొసటి వ్రాతఁ దప్పింప శక్యము కాదుగదా? బోజుండు హతుండయ్యెనని వినియు నక్కడికిఁ బోవలయునను బ్రయత్న మేమిటికో తెలియదు. నా బుద్ధి యంతయు మొద్దు వోయినది. ఈ నీటిలో నుండి పైకెట్లు పోవుదును. పోయియు నెట్లు మసలుదును. దైవమా! నా కీ యాపద యేమిటికిఁ దెచ్చితివి. నీ భక్తురాలి నిన్ని చిక్కులు పెట్టెదవా ? అని పరమేశ్వరుని ధ్యానించుచు నొక యుపాయ మాలోలించి పద్మపత్రంబులన్నియు మేనికిఁ జుట్టుకొని తూండ్లుచే బిగియించుకొని యల్లన తీరముఁజేరి యొక భూరుహ మూలమునఁ గూర్చుండి కర్తవ్యముఁ దెలియక ధ్యానించు చుండెను. అంతలోఁ బద్మినీ కాంతుండు పశ్చిమగిరి శిఖర మలంకరించెను. అట్టి సమయమున గంధర్వకన్యకలు గొంద రా తటాకమున జలక్రీడలాడ నరుదెంచి చేలములు విప్పి కూలమున నిడియోలలంచు నీటంబడి యీదులాడ మొదలు పెట్టిరి.

ఆ వారిజాక్షుల వారి విహారములుసూచి లీలావతి ఔరా ? వీరు సౌరాంగనలై యుందురు జలకమాడువేళ మానవ మానవతుల పోలిక వీరును చేలములు విప్పుదురు. కానిమ్ము. నన్నుఁ జెందిన కుందు వీరికో నొకసుందరిం జెందుగాక. ఒకదానికోక కట్టికొని పోయెద నీ యాపద నీ రీతి భగవంతుండు దాటించెనని తలంచుచు మృగమువోలెఁ బ్రాకి యా కోకలదరి కరిగి మేలైన యొక చేలము సంగ్రహించుకొని మెల్ల మెల్లన బ్రాకుచు దన కటారిఁ దీసికొని డొంకలమాటుగా భైరవాలయమున కరిగి యందాచీర ధరించి కృపాణంబు బాణిమరించుకొని యా భైరవ విగ్రహముచాటున గూర్చుండెను.

అంతలోఁ జీఁకటిపడినది. కొంతసేపటికి ఘంటానాద మొండు వినంబడినది. అది యేమియని యాలోచించుచుండ నొక కాపాలికుఁడా గుడిలోనికివచ్చి విగ్రహము మ్రోలనగ్ని వేల్చి హోమముఁ జేయుచుండ నా కుండమునుండి యొక దేవత బయలువెడలి కాపాలికా! నీ కామితమేమి యెరింగింపుమని యడిగిన నతండు చేతులు జోడించి యిట్టనియె.

స్వామీ ! ఆరునెలలనుండి నేను నీ మంత్ర మిందుఁ బునశ్చరణఁ జేయుచుంటి. నేటికి నీ కనుగ్రహము కలిగినది. నా కోరిక వినుము. చిత్రాంగదుని కూతురు చంద్రముఖియను చిన్నదాని నిచ్చటికిఁ దీసికొని రావలయును. దాని ------------ వర్ణనాతీతమైయున్నది. అక్కాంతం బెండ్లి యాడు తలంపుతో నిన్నా