(36)
జయంతుని కథ
281
ఆ పద్యమును విని యించుక పరితాపంబు మనంబునం జనింపదనకు వ్రాసిన పద్యము నిట్లు చదువుచున్నాఁడు.
శ్లో. మాంధాతాచ మహీపతిః కృతియుగాలంకార భూతోగతః
సేతు ర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దళాస్యాంతకః
అన్యేచాపి యుధిష్టిరప్రభృతయో యాతా దివం భూపతే
నై కేనాపి నిమంగతా వసుమతీ మానం త్వయా యాస్యతి.
కృతయుగమున కలంకార భూతుండగు మాంధాతయుత్రేతాయుగంబునఁ గొండల నీటియందుఁ దేలించిన శ్రీరాముఁడును ద్వాపరయుగంబున రాజ్యము నిమిత్తము జ్ఞాతులనెల్లఁ బరిమార్చిన యుధిష్టిరుఁడు లోనగు మహారాజు లందరు పెద్దకాల మీ భూమి పాలించియు నీ వసుమతి నిక్కడవిడిచియే లోకాంతమున కరిగిరి. పినతండ్రీ ! నీవు మాత్ర మీ భూమి నిందు విడిచిపోఁజాలవు. వెంటఁ బెట్టుకొనియే పోయెదవు. అంతయాస లేకున్న క్షణభంగురమైన శరీరమును నమ్మి నిరపరాధియైన యన్న కొడుకు నేల జంపఁ బంపుదువు ?
అట్టి యర్దముగల పద్యమును జదివికొని యా ముంజుండు తత్కాల జనిత వైరాగ్యవృత్తిచేఁ బశ్చాత్తాపముఁ జెందుచు విగత చేతనుండై నేలంబడియెను. అప్పుడు భార్యవచ్చి లేవఁదీసి సేదఁ దీర్చుటయు నతండు నన్ను ముట్టకుము. నేను జండాలుఁడను. పుత్రుం జంపించితిని. హా ! భోజకుమారా! సుగుణసాగరా ! పూర్వకృతమని పలికితివి యించుకయు నిందింపవైతివి. నీ యట్టి శాంతస్వాంతుఁ బరిమార్చిన నాపాపమునకు మేర కలదా? నీ తండ్రి నిన్ను నా తొడపైనిడి నీకొడుకులాగునఁ జూచుకొమ్మని చెప్పినమాట యించుకయు సాగింపలేక పోయితిని. నాకు నిష్కృతి గలదా యని యూరక దుఃఖించుచుండ నతని భార్య జయంతునితో వత్సా ! మీ తండ్రి కిప్పటికి భోజుని నిమిత్తము పశ్చాత్తాపము కలిగినది. మీ కేదియో పద్యము వ్రాసి పంపెనట. దానిం జూచి దుఃఖించుచున్నారని చెప్పుటయు జయంతుఁ డచ్చటికి వచ్చె.
పుత్రా ! నీపాటి ధర్మపరిపాటి నాకు లేక పోయినది. నిష్కారణము మన్మధాకారుఁడైన కుమారుని జంపించితిని. వాఁడు నీ కొక పద్యమును వ్రాసి పంపెను. చూడుమని యా పద్యపత్రిక నిచ్చెను. దానిఁ జదివికొని జయంతుఁ డురము మోదికొనుచుఁ బెద్దగా విలపింపఁ దొడంగెను.
అప్పుడు ముంజుండు దౌవారికుల నంపి పండితుల రప్పించి పుత్రఘాతకునకు నిష్కృతి యేమని యడిగిన వహ్నిస్రవేకమే ప్రాయశ్చిత్తమని యా బ్రాహ్మణులు ధర్మశాస్త్రములు చూచి చెప్పిరి. అప్పుడా రా జగ్ని ప్రవేశము సేయుటకు నిశ్చయించుకొనియె.