Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

రాజ్యనాశనముఁ గూడఁ గాగలదు. లోభము సకలపాపములకు నెలవు. లోభా విష్టుఁడగు నరుఁడు దల్లిదండ్రులనైన వధించును. లోభమునఁ గ్రోధమును గ్రోధమున ద్రోహమును గలుగుచుండును. కావున నిప్పుడు కర్తవ్య మేమియని యడిగిన బుద్దిసాగరుం డిట్లనియె.

దేవా ! నయకళావిశారదుండగు మీ సోదరుండు మీ యందు బద్ధాధరుండై యున్నవాఁడు. ఇంతదనుక దర్మబుద్ధియనియే పొగడ్త కెక్కెను. అట్టివాఁడు‌ పాపకృత్యములఁ జేయ నొల్లడు రాజ్యభారం బాయనమీదనే యుంచుడు. నేనునుఁ జూచుకొని కాచుచుండెద నని యుపదేశించెను. అతని యాలోచన సమీచీనమని తలంచి సింధులుం డప్పుడ ముంజుని రప్పించి తమ్ముడా ? వీడు నీకునుం గుమారుండే సుమా ? వీనిం బెంచి పెద్దవానిం జేసి విద్యాబుద్దులు చెప్పించి రాజ్యపట్టభద్రుఁ జేయుము. అంతదనుక పూజ్యంబగు నీ రాజ్యంబు నీవుపాలింపుము. ధర్మం బేమరకుమని పలుకుచు భోజకుమారునితోఁగూడి రాజ్యంబతని యాధీనముఁ గావించెను.

కాలక్రమంబున సింధులుండు స్వర్గస్థుండైనంత ముంజుండు సింహాసన మెక్కి తన కుమారుండు జయంతుడను వానితో భోజకుమారుం గూర్చి చదివింపుచు నన్న పోలిక ధర్మంబునఁ గొంతకాలము రాజ్యమును గావించెను.

ఒక నా డా యొడయునియోలగంబునకు జ్యోతిశ్శాస్త్రపారంగతుండగు నొక పండితుఁ గురుదెంచి యాశీర్వాదపురస్సరముగా నరేంద్రా ! నాకు సమస్తవిద్యలు కంఠస్థములై యున్నవి. నీవు నన్నుఁ బరీక్షింపుము అన్నియుం జెప్పఁగలనని సావలేపముగాఁ బలికిన నాలించి ముంజుండు మందహాసముఁ గావించుచుఁ బాఱుఁడా! నేను జన్మించినది మొదలు నేటి తుదదనుక జరిగిన చర్యలన్నియుఁ జెప్పితినేని నిన్ను సర్వజ్ఞుండవని యొప్పుకొనియెదనని బలికెను.

ఆ మాట విని దైవజ్ఞుండు కాలము గణించి యంకెల గుణించి లగ్నముఁగట్టి యంశలం బట్టి యతని వృత్తాంతమంతయుం బూసగ్రుచ్చినట్లు వ్రాసి యిచ్చెను. గూఢాభిజ్ఞానములనుసైతము వ్రాసియిచ్చిన యా కాలజ్ఞుని సామర్థ్యమునకు మిక్కిలి సంతసించుచు ముంజుండు లేచి యెదురువోయి యతని పాదంబులకు సాష్టాంగ మొఱగి నవరత్నఖచిత సింహాసనమునఁగూర్చుండఁ బెట్టి యిట్లనియె. ఆహా ! నిన్నుఁ జూచి సామాన్యుండవని యుపేక్షఁ జేసితిని. నీ విద్య యనవద్యయైయున్నది. నీవు త్రిలోక పూజనీయుండవని కొనియాడుచు నుచ్చైశ్శవంబునుబోలు పదియశ్వముల నిచ్చి సంతోషపరచెను.

అట్టి సమయంబున బుద్ధిసాగరుండు దేవా ! భోజకుమారుని జన్మపత్రిక నీ విప్రునికిం జూపి ఫలముల నడుగరాదా? యని పలికిన విని ముంజుండు సంతసించుచు నతనిజాతకముఁ దెప్పించి చూపించెను. దైవజ్ఞుండా పత్రికం జూచి యా