Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

లింగకవి వత్సా ! నీవృత్తాంతమంతయు వింటిని బ్రాహ్మ్యక్షత్ర తేజంబులు రెండును నీయందు పొలుపొందు చున్నవి. నీ పరాక్రమమునకు క్షత్రియులును బాండిత్యమునకు విద్వాంసులును బొగడుచున్నారు. నీ కతంబున మా వంశంబు పవిత్రమైనది. అని కొనియాడుచుఁ గొన్ని శాస్త్రములయందుఁ బరీక్షంచెను.

ఘటదత్తుఁడు యుక్తియుక్తముగా గంభీరవాగ్గుంభనలచే నుపన్యసించి రామలింగకవికి విస్మయముఁ గలుగజేసెను. కృష్ణదేవరాయలును బరమానంద భరితుండయ్యెను. అప్పుడు మంజరికయుఁ బాటలికయు గావించిన క్రూరకృత్యములవలన వీరికి యిక్కట్టు గలిగినదని విని రాయలు మిక్కిలి యాగ్రహించుచు వారింబట్టికొనికట్టి తీసుకొని రావలయునని కింకరుల కాజ్ఞాపించుటయు రామలింగకవి వారించుచు నదికేవలము వారి దోషముకాదు అందు మనవారును గలిసియుందురు. విమర్శింపం బనిలేదు. దైవవియోగమున కొకరి నన నేమిటికి? పోనిండు. రత్నమునకు రాచినకొలది వన్నెఁ గలుగునట్లు వీరి దేశసంచారముమూలమున శీలప్రభావముల తెల్లమైనవని సమాధానముఁ జెప్పెను. రామలింగకవియు సరోజినియు నుక్తియుక్తులతో నొకనాఁడు సంభాషించిరి. సరోజినియుక్తియే పైనగుటయు రామలింగకవి‌ సంతసించుచు నన్నిగతుల నిన్నుఁ జనమందారవల్లి యని పిలువవచ్చును. గణికాధర్మము లిరువురయందును వర్తించినవి గదాయని పరిహసించుటయుఁ బండితులే పంగ్వంధబధిరభావము వహింప వారియాఁడువారు గణికలగుటయబ్బురమా యని సమాధానముఁ జెప్పినది. ఈ రీతిఁ గొన్నిదినంబు లందుండి మనుమలతో ముచ్చటించుచు రామలింగకవియుఁ గృష్ణ దేవరాయలును దమపురమున కరిగిరి. ఇంద్రదత్తా ఘటదత్తులును, సరోజినీసుముఖులును సర్వ సౌఖ్యములు చెందుచుఁ బెద్దకాలము భూలోకమును బాలించిరి.

గోపా ! యాకథ‌ నీ వడిగిన ప్రశ్నమునకు సమాధానమైసదాయని పలుకుచు మణిసిద్ధుండు వానితోఁగూడి యా యవసధమున సుఖముగా వసియించెను.