Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఇంద్ర - మొదట నెరుఁగదు. తరువాతఁ జెప్పి యొప్పించితిని. ఈపాటి కయ్యగారితో మాట్లాడియే యుండును.

ముర - జాగుసేయనేల? నే నిప్పుడేపోయి చూచి వచ్చెదఁగాక. అని పలికి మురళి యప్పుడే సుమతిసత్రమున కరుదెంచి నలుమూలలు వెదకి వారిం గానక మరియు నగరమెల్ల గాలించి తెలిసికొన లేక విసిగికొనుచుఁ దిరుగ రాజుపుత్రియొద్దకు వచ్చి యిట్లనియె.

మచ్చెకంటీ ! నేనీ యానతిఁ బుచ్చుకొని యా సుమతిసత్రమున కరగితిని. ఆహా ? అది సత్రమువలెనే బహు జనాకీర్ణమై యొప్పుచున్నది. కొందరుమూటలు దింపు చుండిరి. కొందరు మూటలఁ గట్టి పయనమగుచుండిరి. కొందరు వంటఁ జేసికొను చుండిరి. కొందరు భుజించు చుండిరి. ఆ సంఘములోనికిం బోయి నేను సరోజినియను చిన్నది యుండవలె నెందున్నదని యఱచితిని. ఆ మాట కెవ్వరును బ్రత్యుత్తరమీయ లేదు పలుమా రట్లు చీరి విసిగి ఘటదత్తుడను చిన్నవాఁ డిందుండెనాయని వెండియుం బిలిచితిని. అప్పుడును బ్రతివచనము వచ్చినది కాదు. అందొకఁ డెవ్వడో నా మాట విని ఘటదత్తుం బట్టుకొనిన వానికి మూఁడు గ్రామములు కానుకగా నిత్తునని కాళిందీపుర భర్త ప్రకటించియున్న వాఁడే ? అతం డిక్కడ నేమిటికుండు నని పలికెను.

పిమ్మట నేనా సుమతి యొద్ద కరిగితిని. ఆ పుణ్యాత్ముండు కొందరకు స్వయంపాకము కల్పించుచుఁ గొందరకుఁ బాత్ర లర్పించుచుఁ గొందరకు విత్త యొసంగుచుఁ గడు సందడిలో నుండెను ? పెద్దతడ వందు వేచియుండి యవసరముఁ దెలిసికొని నమస్కరింపుచు మహాత్మా ? మీ సత్రంబున సరోజినియను చిన్నది రంగులు వేయునది బస జేసినదట. ఎందున్నదో యెరుగుదురా ? యని యడిగిన నతండు నాకుఁ దెలియదు పోయి చూచికొమ్మని చెప్పెను.

సత్రమంతయు వెదకితిని. నా కెందును గనంబడలేదు. దానితో మన రాజపుత్రికకుఁ బని వచ్చినది. మిమ్మడిగి తెలిసికొని రమ్మన్నదని చెప్పిన పిమ్మట నతండు నా మాట శ్రద్దగా వినిపించుకొని గ్రమ్మరఁదన పరిజనులచే నా సత్ర మంతయు వెదకించెను. ఎందును లేదు పిమ్మట నేనీ వీటిలో బాటసారులు వసియించు చోటు లన్నియుం జూచితిని. సరోజినీ ఘటదత్తులజాడ యించుకయుఁ దెలియలేదని చెప్పినది. ఆ మాట విని రాజపుత్రి యించుక ధ్యానించి మురళీ ! నీవు లెస్సగా విమర్శించి వచ్చితివికావు. అది యా సత్రమునందే యున్నది. దాని రూపము సామాన్యముగా నుండుటచే నలువురకుఁ దెలియఁబడదు. ఏ మూలనో యణఁగియుండి నీ కేక వినకపోవచ్చును. నాతోఁ దానం దుందునని చెప్పి యింతలో నెక్కడిఁకి బోఁగలదు. ఒకవేళ ఘటదత్తుని బస కరిగినదేమో ? అతని నెల వెందో యడుగుట మరచిపోయితిని గదా? కాళిందీపుర భ ర్తకు నతనిం బట్టికొమ్మనుటకు గారణ మేమియో తెలియదు. అతండు వేరొకఁడు కావచ్చును. మఱియుం బోయి చూచిరమ్మని పలికినఁ