230
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
దర్శనంబున నేడు మాకుఁ జాల ధనము దొరికినది. నీ సత్యమునకు మెచ్చుకొంటిమి. నీ సొమ్ములు మే మొల్లము. నీవు మాకుఁ దోబుట్టువవు కావున మరికొన్ని నగలు నీకుఁ గానుకలిచ్చుచుంటిమి. కైకొనుమని పలుకుటయు నక్కలికి మరల నిట్లనియె.
అన్నలారా ? చోరులకు దయాదాక్షిణ్యము లుండవు మీరు మీ వృత్తికి మించిన యుపకారముఁ గావించితిరి. ఇదియనాకుఁ బదివేల కట్టనములు. ఉపకారము సేసిన సోదరుల కీపాటిసొమ్ము లిచ్చుట యబ్బురముకాదు. రవణంబులం గొనుడు పోయి వచ్చెదనని వాక్రుచ్చిన నమ్ముచ్చులు కట్టా! నీ నగలు ముట్టిన మేము జీవింతుమా ? వలదు వలదు. వీనిం గొనుమని పలుకుచు గొన్ని మండనములు బలవంతమున గొంగున ముడివైచి యా చిగురుబోణి నింటిదనుక సాగనంపి పోయిరి.
ప్రభావతి భర్త భానుమంతుడు తనభార్య చర్య లెట్టివో పరిశీలించు తలంపుతోఁ గుప్తముగా వెనువెంటఁ దిరుగుచు నా విశేషము లన్నియుం జూచి తదీయ పారిశుధ్యమునకు నెంతేని సంతసింపుచు నేమియు నెరుంగనివాఁడుం బోలె మరలఁ బోయి మంచముపైఁ బండుకొని నిద్రవోవున ట్లభినయించుచుండెను.
ప్రభావతి మెల్లగాఁ దలుపుఁ దెఱచుకొని గదిలోనికిం బోయి మగఁడు నిద్రించుచున్నవాఁడని తలంచి విపంచి మేలగించి సంగీతము పాడఁ దొడంగినది. ఆతం డదరిపడునట్లు లేచి తల్పముపై గూర్చుండి బోఁటీ ? పోయివచ్చితివా ? గురుని సంతోష పెట్టితివా ? గురుదక్షిణ సాంతము ముట్టఁజెప్పితివా ? యని యడిగిన నప్పడఁతి లేచి నిలువంబడి యించుకసిగ్గుతో దాను బోవుచుండ దారిలోఁ జోరు లడ్డ గించుటయు వారి బ్రతిమాలుకొని గురునొద్ద కరుగుటయు నతండు పశ్చాత్తాపముఁ జెందుటయు లోనగు వృత్తాంతమంతయు నెఱింగించిన నతండు నవ్వుచు నిట్లనియె.
అహా ! పంకజాక్షులు బొంకులకు నెలవు లనుమాట నేటికి దృఢమైనది. మొదట సెప్పితినికాదా ? చేసినపని చెప్పినం దప్పా ? దానిలోఁ గొంచెము నేర్పరితనముఁ జూపెద వేమిటికి ? నిన్నుఁగన్న కన్నగాండ్రు విరక్తిఁ జెందిరా ? ఏమి నిన్నేమియుం జేయక యూరక నగలిచ్చి యంపుదురా ? మొదట వరించిన గరుం డింతలో వృద్దుఁ డయ్యెనా ? నీ మాట లెట్లు నమ్మనగు. నీవు భూతదయగలదాన వగుట దొంగల కామితమును దీర్చియే యుందువు. కామధేనువువలె నడిగిన వారి కామము లెల్ల దీర్చుచుందువు. నిన్నుఁ గొనియాడఁ దగినదే యని సాక్షేపముగాఁ బలికిన విని యవ్వనితామణి యొక్కి౦తసే పేమియు మాటాడక యశ్రుపూర్ణవదనయై మెల్లన నిట్లనియె.
ప్రాణేశ్వరా ? నా చెప్పిన కథ నిక్కువమని నాచేత నగ్నిం బెట్టి పరీక్షించు కొనుడు. ఊరక నన్నేల పరితపింపజేసెదరు ? మీ సూటి మాటలు