Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభావతి కథ

223

దూష్యముగాదు. నే నంతఃపురమునఁ బ్రవేశించినను మీరు వచ్చుట కభ్యంతరము లేదు. మీ యింట నేకార్యమైనను నేను వచ్చుచుం బోవుచుండెదను. ఇందులకు మీరు విచారింప నక్కరలేదు. గురుదక్షిణ స్వీకరించి నన్నాశీర్వదించి యంపుఁడని మరియుఁ బ్రార్థించినది.

బాలా ! నీతో నేమనుటకును నాకు వాక్కురాకున్నది. ఉపేక్షించితివేని నీకు గురువధ మహాపాతకము రాగలదు. ఈ రెంటిలో నేది యధికమో యాలోచించు కొనుము. అని యర్దోక్తిగాఁ బలుకుటయుఁ నయ్యువతీరత్నము తండ్రీ ! నాకడ నింత సందియముగా మాట్లాడుచుంటిరేమి ? నీ కామితమేదియో చెప్పుము. నా తండ్రితోఁ జెప్పి తీర్పించెదను. నా ప్రాణమిచ్చియైనను నీ యభిమతముఁ దీర్పగల దాన నుడువుమని యడిగినది.

అతండు చేతులు నలుపుకొనుచు ముదితా ! యిదిగో నీ చేతిలోఁ జేయివైచుచున్నవాఁడ నసత్యము లాడువాఁడనా ? చెప్పుటకు నోరురాదు. నీవే గ్రహించి తీర్పవలయు. అన్నన్నా ! అతను విలాసములు విచిత్రములుగదా ? యని యభిలాష సూచించుటయు నయ్యిందువదన యది యేదియో తెలిసికొనఁజాలక తండ్రీ ! భూములుగాని, గ్రామములుగాని, గనకమణిభూషణాదులుగాని కావలసిన నిప్పింతునని జెప్పినది. ఇంతకన్న వేరొక కామితమేదియో తెలియకున్నది. మొగమాటమేల? విప్పి చెప్పుమని యడిగిన నతం డిట్లనియె ?

గజగామినీ ! నిజము దాచనేల ? వినుము. అద్భుత లావణ్య రూపరేఖావిలాసములచే నలరుచున్న నిన్నుఁజూచిన శ్రీశుకు౦డైన వలపుఁ జెందక మానఁడు మదనుఁడు నీ రూప మెరవైచి కుసుమనారాచముల నా పీచ మడఁచుచున్నవాఁడు. ఒకసారి నీ యధరామృత మిచ్చితివేని బ్రతికిఁ బోదును. లేనిచోఁ జావు సిద్దమైయున్నది. శరణమవై మరణముఁ దప్పింపుమని ప్రార్దించిన నాలించి యా చంచలాక్షి నేలఁ బళ్లెరము పారవైచి ముక్కు పై వ్రేలిడికొని యొక్కింత తడవు ధ్యానించి యిట్లనియె.

ఆర్యా ! శిష్యురాలికిని గూఁతునకు నింతయేని భేదమున్నదియా ? ఎట్టి నీచుఁడైనను బుత్రికను మోహించునా ? నీ చేతిలోఁ బెరిగి విద్యలం గరపిన నాపై నీకు వ‌లపెట్లు గలిగినది ? విద్యానిధివైన నీవు పస్తుతత్వ మెరుంగవా ? ధర్మాపరాధమునకు భూతములు కినియకుండునా ? చాలుఁ జాలు. మేదోమాంసరుధిరాస్థి పూర్ణణై కాయంబగు కాయంబుజూచి భ్రమఁజెందుట విచక్షణ పద్ధతియా ? ఇంద్రియముల నియమింపుము. దుర్గతిఁ బొరయకుము. అని నయకళా విదగ్దములగు మాటలచే నతని సిగ్గుపడఁ జేసినది.

అతం డొక్కింతతరి యధోముఖుండై ధ్యానించి దీర్ఘనిశ్వాస పూర్వకముగా రాజపుత్రీ ! నీ వనినమాట లన్నియుఁ దథ్యములు సకల శాస్త్రపురాణములం