Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

బాదుకలుగొనియు ఛత్రములు పట్టియు వాహనములఁ దీసికొనివచ్చియు వెంటఁబడిరి. ఓహో ! మంత్రిగారెక్కొడికో పాదచారులై పోవుచున్నారు. అనుసరించి యేగవలయునని కొందరు సామంతులు వెన్నంటి కలిసికొనిరి. మరికొంద రాయుధముల ధరించి తోడపోయిరి. కొందరు తూర్య నినాదములు మ్రోయించిరి. కొంద రెదురుపడి నమస్కరించిరి. కొందరు దీవించిరి. ఇట్లు కనంబడినవారెల్ల నతని మన్నించుచుండ నందరిని హాస్తసంజ్ఞచే వారించుచునే వావానము నెక్కక యెవ్వరిందోడ రానీక యెవ్వరితో మాటాడక నొక్కరుండ యొక దారింబడి నడచుచుఁ గ్రమంబున నగరంబు దాటి, తోట లతిక్రమించి క్రీడాగిరులు గడచి విశాచావిష్టుండు వోలె నొండుచూడక తలవంచికొని యూరక నడచుచు మహారణ్యములోఁ బ్రవేశించెను.

మిట్ట మధ్యాహ్నముదనుక క్షుత్పిపాసల గణింపక యట్లు నడచుచు నతండు పెద్దదూరము పోయి తీవ్రాతపసంతాప ప్రతాపితప్రతీతుండై యలయిక జనింప నడువలేక నొక చెట్టునీడం‌ జతికిలంబడి యిట్లుఁ జింతించెను. ఆహా ! దురదృష్ట దేవత నా కెంతలోఁ బ్రసన్నమైనది. నేఁటి యుదయముదనుక మహారాజ్య వైభవమనుభంచి గడియలోఁ బరమ నిర్భాగ్యుండనై పోతినిగదా ? అమ్మహారాజు నన్నుఁ బుత్రుండువోలె గారవించుచు శిష్యుండట్లు మన్నించుచు మిత్రుని పగిది నాచరించుచు గరుణారస తరంగితములగు చూపులు నాపైఁ బరగించుచుఁ నుల్లంబునం గలయక్కటికంబు వెల్లడించు చల్లనిమాటల నా కాహ్లాదము గలిగించువాఁడు. ఆ దయాశాలి నోటినుండి యెట్టి పరుషాక్షరములు వింటిని. అయ్యో ? నన్నుఁ బొమ్మన్నప్పుడు దేవా ! నేనేమి నేరముఁ జేసితిని. నా యపరాధము నిరూపించి తగినకిక్ష విధింపుమని చేయిఁ బట్టుకొని యడుగక యూరక పందవలెఁ బరుగిడి వచ్చితిని. ఇంత మూర్ఖుఁ డెందైనం గలఁడా ? అక్కటా ? నన్నొక థీవసము చూడక మిక్కిలి పరితపించు తలిదండ్రులకై నఁ జెప్పివచ్చితిని కానేమి? హా ? జగదీశ్వరా ! నా కసమాన విద్యా రూప వైభవముల నిచ్చి నచ్చి యిప్పు డధోగతిం బొందించితివిగదా ? ఎట్లయినను గరుణా సాగరుండగు నా వసుంధరునకు నాయెడ నేదియో యనుమానముఁ గలిగినది. అక్కళంకము వాయఁజేయ నిన్నుఁ బ్రార్ధించుచున్నవాఁడ. అయ్యో ? తలఁచికొన్న నా డెందము పగిలిపోవుచున్నది ఆ ? ఏమి ? నిజముగా నేనీ యరణ్యమునకు వచ్చితినా ? లేదు లేదు. ఇది స్వప్నము. ఓ పాడుస్వప్నమా ! వేగము నన్ను వదలిపొమ్ము. మరల నమ్మహారాజునొద్ద కరుగవలయును. అక్కటా ! ఎక్కడిరాజు ? అతని వేడిమాటలం దలంచికొని నేడుపు వచ్చుచున్నది. నా కిది యెక్కడి స్వప్నము. జీవితాంత మీ యాతనాశరీరము ధరించి పరలోకమున కరుగుచున్నవాడనని యనేక ప్రకారముల దుఃఖించుచు మూర్చాలసవివశ మానసుండై యొడ లెరుంగక నేలం బడియుండెను.

అని యెరింగించి యవ్వలికథ మరల నతం డిట్లని‌ చెప్పందొడంగెను.