ఘటదత్తుని కథ
203
వట్టిగోల ఏకర్మము నెరుఁగదు. చెప్పినం దెలిసికొనఁ జాలదు. మందారవల్లి గట్టి మందు పెట్టినది. దాని వలలోఁ జిక్కినది. మనమేమి చేయుదుము పోనిండు ప్రసవ మక్కడనే కానిండు. మే యిరువురు కూడ నుందురు గదా? మీకంటె నాప్తులెవ్వరు ? లోపమేమియుఁ గలుగదు. కాని మరియొక లాఘవము మనకుఁ గలుగఁ గలదు. అది మీరు లెస్సగా నాలోచింపుడని కొన్ని రహస్య వచనంబు లుపదేశించుటయు మంజరిక యించుక వితర్కించి అమ్మా ? మొదటినుండియు మనము ప్రయోగించు కపట క్రియలన్నియు మనకే తగులుచున్నవి. ఊరకఁ యొరుల కపకారము సేయుట నీతి కాదని పలికిన మంజరికను వారించుచుఁ బల్లవిక యిట్ల నియె.
పుత్రీ ! పిల్లదానవు. దివాణపు చర్యలు నీవేమి యెరుంగుదువు. అంతఃపురకాంతలు సంత తికై యెంతెంత లేసి పనులఁ గావింతురో పలుక శక్యమా ? పుణ్యపాప వివక్షతతోఁ బనిలేదు. సాగునది యాలోచింపవలయును. ఇప్పుడమ్మగారు సెప్పిన మాట గూఢముగా మనకు జేయకతీరదు. మన భర్తృదారిక పుత్రునే చక్రవర్తిగా నాచరింపవలయును. ఇందులకుఁ బ్రతికూలము సెప్పక యుపాయ మాలోచింపుమని పలుకుచుఁ గళానిలయకుఁ సంతోషముఁ గలుగఁ జేసినది. మంజరికయు వారి మాటల కెదురాడ వెరిచి యట్లుచేయుట కొడంబడినది. పిమ్మట నిరువురు గళావతితోఁ గూడఁ గుముద్వతీ నగరమున కరిగిరి.
అని యెరిగించి మణిసిద్దుండు ప్రొద్దు మిగలుటయు నవ్వలి వృత్తాంతము తరువాతి మజిలీయందుఁ జెప్పఁ దొడంగెను.
ఎనుబది నాలుగవ మజిలీ.
ఘటదత్తుని కథ
అన్నన్నా ! భగవంతుడు సర్వసముండని వాడుకయేకాని యంత పక్షపాతి యెవ్వడును లేడు. నా తోడికోఁడలికి గడుపునిండఁ బిల్ల లనిచ్చి నాకొక్క బిడ్డనైన నీయకపోయెనే. నే నేమి యపకారముఁ జేసితిని. కావలసినంత భాగ్యమిచ్చినవాఁడీ యుపకార మేమిటికి జేయఁగూడదు? అన్నిప్రక్రియలు కావించితిని దేనివలనం బ్రయోజనము లేక పోయినది. యోగిని చెప్పినపని కడమగా నున్నయది. అప్పని యాడువాండ్రు చేయుట కష్టము. అర్దరాత్రమున శ్మశానభూమి కేగి స్నానముఁజేసి కాలుచున్న కుణపము నారిపి తత్కపాలచూర్ణమును దానిచ్చిన మంత్ర భస్మముతో గలిపి తినమని చెప్పినది. రాత్రి కాటిమాఁట దలపెట్టినంతనే మేను ఝల్లుమనును. పీనుగను జూచినఁ బ్రాణములు నిలుచునా> పోనిమ్ము. నావంటిది బ్రతికియున్న నేమిలాభము? గుండెరాయిఁ జేసికొని యిప్పనియుం గావించి చూచెదం గాక నేఁడు పర్వదినంబుగదా? మృతయైనం గావలయు నక్షిమతమైనం దీరవలయును.