Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌముదీకళావతుల కథ

197


కాశీ మజిలీ కథలు

ఎనుబది మూడవ మజిలీ

కౌముదీకళావతుల కథ

చ. నరనుత నేఁడు వింతలు గనంబడవేమియు నిందుయక్షిణీ
    వరజనిత ప్రభావనితవద్య యశోనిధి రామలింగ ధీ
    వరసుతఁ డవ్వసుంధరుని వార్తవినం గడు వేడ్కఁ బుట్టెఁ ద
    చ్చరితమునందు నెందయిన నత్కథకల్గిన నానతీఁగదే.

అని శౌనకుం డడుగుటయు మణిసిద్దుం డాత్మీయమణి ప్రభావంబుననందలి విశేషంబు లన్నియుఁ గరతలామలకముగాఁ దెలిసికొని గోపా ! నేఁడు నీ ప్రశ్నంబునకుఁ దగిన యాశ్చర్యకరమగు కథ యొకటి నా హృదయమునఁ దోచుచున్నది. వినుపింతు నవహితుండవై యాకర్ణింపుము. తెనాలి రామలింగకవి కుమారుండు వసుంధరుఁడు యక్షిణీదత్త వరప్రభావసంపన్నుండై రాయలవారి కూఁతురుఁ గళావతిని, కుముద్వంతునిపుత్రిక కౌముదిని బెండ్లియాడి యిరువుర భార్యలతో సుఖింపుచుఁ గుముద్వతీనగరంబుఁ బాలించుచున్నాఁడని నీకు వెనుకఁ జెప్పియున్నానుగదా ? రాయలవారిభార్య కళానిలయకు మందారవల్లియందుఁగల యీ సునఁదనసుత నా వసుంధరునకిచ్చుట కిష్టములేకున్నను స్వయముగాఁ కళావతి వసుంధరుని వరించుటచే నా పెండ్లిఁ జేయుటఁ తప్పినది కాదు.

అట్లుండ నొకనాఁడు పల్లవిక కూఁతురు మంజరిక యను పరిచారిక కళావతిచేఁ బంపబడి కుముద్యతీనగరమునుండి కళానిలయయొద్దకు వచ్చి నమస్కరింపుచు దేవీ ? నేను భర్తృదారిక పరిచారిక మంజరికనుఁ ఆమె పుత్తెంచిన నరుదెంచితిని. కళావతియుఁ గౌముదియు క్షేమముగా నున్నారు. మీ కుశలముఁ దెలిసికొనిరమ్మని రని నుడివిన యవ్వనిత మొగమింతఁ జేసికొని కౌముది సేమ మెవ్వరికిఁ గావలయును కళావతి యెట్లున్నది ? మందారవల్లియందే యున్నదియా ? దానిచేఁ బనులు సేయించుకొనుచున్నదా ? అన్నన్నా ! మా యింటికడుపుకూటి పారునిం బెండ్లియాడిన బోగముదాని గర్వభంగముఁ గావింపలేకపోయితినిగదా ? అది నాఁడు నాకుఁ గావించిన యవమాన మేతన్మాత్రమే. నా ముద్దు పట్టిని దాని యింటికి దాదిగాఁ జేయవలసివచ్చినది. సీ. పాడువిధీ ? యీ మానవతీ శిరోమణి కెట్టి యవమానముఁ గలుగఁ జేసితివి. అయ్యో? నా బిడ్డ సవతి యింట నెట్లు కాపురముఁ జేయుచున్నది? మంజరికా ! నాతో నేమి చెప్పుమన్నది? రహస్య విశేషము లేమైనం జెప్పినదా? చెప్పుము. చెప్పుము అని యడిగిన మంజరిక యిట్లనియె.