Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామందకుని కథ

189

అప్పుడు కరభ శరభ శంతన వీర సేనులు నలువురు నయ్యగ్రహారములోఁ బ్రవేశించి మెల్లగాఁ గామందకునితో మైత్రిజేసి పది దినములు కలిసిమెలసి వర్తించిరి. ఒకనాఁడు రాజపుత్రుండు కామందకుంజూచి మిత్రమా ! నీతండ్రి మిగుల విద్వాంసుఁడు. గజగర్ణ గోకర్ణములను మహావిద్యల నెరింగిన ప్రోడ. అట్టివాని కొమరుండవు నీవింకనుం బెండ్లి యాడితివి కావేమి? నీకెవ్వరు కన్యనిచ్చిరి కారా? యేమియనియడిగినఁ గామందకుం డిట్లనియె.

వయస్యా! పెండ్లి పెండ్లియని మావారు నిత్యము నిర్భధించుచున్నారు. పెక్కండ్రు పిల్లల నిత్తుమని‌ వచ్చిరి. నాకు నచ్చిన పిల్ల దొరకక పెండ్లి యాడితిని గాను. అదియునుంగాక మా బ్రాహ్మణులలో హావభావ విలాసములం దెలిసికొన కన్యక లుండరు

సీ. ప్రతిదివసంబు తప్పకఁ దానమాడుఁ జ
          న్నీళ్ళ నిష్ఠకు మేని నిగ్గు సెడఁగఁ
    ననుసోయగ వెండ్రుకల్‌ గొనబుమీరఁగ దువ్వి
          సిగఁజుట్టుకొనక వై చుకొను దురుము
    చెలువు మీరంగఁ గచ్చెళులు దీరిచి వల్వఁ
          గట్టదు మడియంచు జుట్టఁబెట్టు
    బొమలసందున నందముగఁ జిన్నితిలకంబు
         దిద్దక మరిబెట్టుఁ బెద్దబొట్టు

గీ. నగలు దాల్పఁగ నేర్వదు వగలు మీర
    బలుక నేరదు హావభావముల నెఱిఁగి
    వ్రతములకె కాని రతులకుఁ బనికిరాదు
    వేషముల నేమి యెఱుగని విప్రకాంత.

బ్రాహ్మణకన్యకలు శృంగార కళాచాతుర్య రహితలని పెండ్లి యాడుట మానితినని చెప్పగా విని రాజపుత్రుండు నవ్వుచు నిట్ల నియె.

చెలికాఁడా ? నీవు రసికశేఖరుఁడ వగుదువు నీకుఁ దగిన నెలఁతయున్నది. పెండ్లియాడగలవా! ఆ సొగసు, ఆ వగలు, ఆ యొయ్యారము, ఆ చాతుర్యము, ఆ విలాసములు ఆ మాయలు బ్రహ్మసృష్టిలో మరియొకయాడ దానికిఁ గలవనిచెప్పలేము. అది స్వతంత్రముగా రాజ్యుముఁ జేయుచున్నది. క్షత్రియకన్యక దానిపేరు కాంతిసేన ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమారీవిద్యలన్నియు నేర్చియున్నది. మీ తండ్రి యొద్ద నున్న గజకర్ణగోకర్ణ విద్యలుమాత్రమే దానికిఁ దెలియవు. వాని నీ వుపదేశముఁ బొందిపోయితివేని నిన్ను వరింపగలదు. దాని మాయకులోనై విద్యయిచ్చితివేని మావలెనే కష్టపడుదువని యా కాంతిసేన వృత్తాంతము తాము పొందినపరిభవము లోనగు కథ యంతయుం జెప్పెను. అప్పుడా కామందకుఁడు చంకలెగరవైచుచు తండ్రియొద్దకఱిగి