188
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
జేయుదునని నమ్మించిన యాదాసీరండ మాయిద్దరిలోఁ గంతలు వెట్టి యారాచపట్టిం బెండ్లి చేయదునని యేమేమో చెప్పి నమ్మించినది. మీ మాటలే యసత్యములని బోధించినది. కాంతిసేన తన తళ్కుచూపులు మాకెరవైచి మమ్మువలలో వై చికొని మా విద్యలు లాగికొని చెఱసాలం బెట్టించినది. ఎట్లోతప్పించుకొని వచ్చితిమి. రాజపుత్రా ! మీరన్నంతయు జరగినది. మాకూటిలో దుమ్ముపడినది. తరతరంబులనుండి యీ విద్యలు మావంగడమున నున్నవి. మాపేరు చెప్పిన నెంతెంతలేసి మవారాజు లైనను మాకు వెఱచుచుందురు. ఇప్పుడు వట్టి నిర్భాగ్యుల మైపోతిమి అని యా తస్కరు లిరువురు బిగ్గరగా నేడువఁ దొడంగిరి.
కరభ శరభ శంతనులు పక్కున నవ్వుచుండ రాజపుత్రుండు వారినూరడించుచు మీకు వచ్చిన భయములేదు. మీ కుటుంబముల మేము పోషించుచుందుము. యధేష్టముగాఁ దిరుఁగుడని జెప్పెను. వాండ్రు దుఃఖించుచు నిండ్లకుం బోయిరి.
రాజపుత్రుండు శంతనాదులతో నిఁక మన మాకాంతిసేనను వంచింపలేమా? పుడమి నెందైన మాయాబలవేత్తలులేరా? కర్తవ్య మేమి యని యడిగిన శంతనుఁడు రాజపుత్రా! విద్యలు నేర్చినవారు పెక్కండ్రు పుడమియం దుందురు. కాని కాంతిసేనను మాత్రము జయించలేరు. మనమిక దానిజోలికిఁ బోక సుఖముగా నిందుండ వలసినదే. లేనిచో ముప్పు రాకమానదని యుత్తరముఁ జెప్పెను. అందులకు సమ్మతింపక వీరసేనుఁడు కాంతిసేనం బరాభవించు తలంపుతో శాంబరీ విద్యాభిజ్ఞుల నరయుచు శంతనాదులతోఁ గూడికొని కొన్ని దినములు దేశాటనముఁ గావించెను.
అని యెరింగించి యవ్విరించి కులవతంసుఁ డప్పటికి సమయాతీతమగుటయు నవ్వలి కథ నవ్వలి మజిలీయందిట్లు చెప్పఁదొడంగెను.
ఎనుబది రెండవమజిలీ.
కామందకుని కథ
శంతనా ! ఈ యగ్రహారములో జలంధరుఁడను బ్రాహ్మణుడు గజరకర్ణ గోకర్ణములను మహామాయావిద్యల నెరింగియున్న వాఁడట. అతడు మహాతపశ్శాలి యగుట నెవ్వరిపైన నివి ప్రయోగించఁడట. మరియు నాయనకుఁ గామందకుఁడను గుమారుఁడు గలడఁట. వాడు సకల గుణాభిరాముఁడని చెప్పిరి. ఏవిద్య రాకున్నను తండ్రికొక్కరుఁడే కొడుకగుట వానియం దత్యంతప్రేమఁగలిగి యున్నవాడట. మన మా కామందకు నాశ్రయించి యా కాంతిసేన వృత్తాంతముఁ జెప్పి దాని వంచించు తెఱం గెరుంగుదము. కుమారుఁ డెట్టివాఁడైనను దండ్రి తనకు వచ్చిన విద్య నుపదేశింపక మానఁడు. ఆవిద్యలు మనకు స్వాధీనములైనచో నా రాజపుత్రికను దాదిగా నేలక పోవుదుమా?. అని చెప్పిన వీరసేనుని మాటలు విని శంతనుఁడు కానిమ్ము. నీకు దోచినట్లు చేయుమని యుత్తరముఁ జెప్పెను.