Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంతిసేన కథ

171

కొనియెద నిందులకు నీవు చింతిల్ల వద్దని కాంతిసేన తల్లికి బోధించినది. అని యెరింగించి కాలాతీతమైనంత నవ్వలి వృత్తాంత మ య్యతిపతి తదనంతరావ సంథంబున నిట్లుజెప్పఁ దొడంగెను.

డెబ్బది తొమ్మిదవ మజిలీ

కాంతి సేన కథ

శంతనా ! నీ వింత మతిహీనుఁడ వై తివేమిఁ కాంతిసేనను గరభునకుఁ నిశ్చయింప నీ వేల యూరకుంటివి? నీవు బ్రాహ్మణుండవుగావా ? బానపాత్రుండవుగావా ? ఈ ఫలము చిరకాలమునుండి యాశ్రయించుకొనియున్న నీ వనుభవింపక మొన్న వచ్చిన కరభున కేలఁ గట్టిపెట్టు చుంటివి. అతఁ డెవ్వఁడు ? నీకంటె విద్వాంసుడాఁ సొగసుకాఁడా ? మీ‌ యిరువురకు నేమైన సాంకేతికమున్నదా ? రాజ పుత్రికకు వానియందిష్టములేదఁట. నిన్నీ విషయమడిగి రమ్మన్నదని కేసరిణి యను పరివారిక యొకనాడు నడి తెఱవులో నిలువంబెట్టి శంతను నడిగినది.

ఆ మాటవిని శంతనుండు కేసరిణీ ! నీ వన్నమాట సత్యమే ? రాజునకు నాయం దాదరము కలిగియున్నది. నా మాట నే నతనియొద్ద నుడువుటలెస్సగాదు గదా? కరభుం డింద్రజాలవిద్య నెరింగిన కతంబునఁ దత్ప్రభావంబున రాజును వంచించుచున్నాము. నీవు నా కాప్తురాలవు కావున జెప్పుచుంటి. ఎవ్వరితో ననవద్దు. ఆ యింద్రజాలము నా కిచ్చునట్లును వానికిఁ గాంతిసేనను బెండ్లిఁ జేయునట్లును మే మిరువురము శపధములు చేసికొంటిమి. దానంజేసి వానికిచ్చునట్లు నిశ్చయించితి నని యా రహస్యము లన్నియుఁ దెలియపరచెను.

అప్పడతి అయ్యో ? వెఱ్ఱిపారుఁడా ? రాజవైభవముకన్న నింద్రజాల మెక్కువదియా ? తొందరపడి వారికిఁ బెండ్లి చేయింపకుము. మరి రెండు దినములు గడుపుము. నీవే పెండ్లియాడునట్లు చేసెదనని యేమేమో బోధించి యతని దన చుట్టును దిరుగునట్లు చేసినది.

మఱియొకప్పుడు కరభుఁ డంతఃపురమున కరుగుచుండఁ జూచి కేసరిణి అడ్డముగా నిలువంబడి నమస్కరింపుచు దేవా ! నీవు నన్నెరఁగవు. రాజపుత్రిక సఖురాలను. కేసరిణి యండ్రు. నీవు భర్తృదారికను పాణిగ్రహణముఁ జేయ నిశ్చయించినట్లు తెలిసినది. ఆమె నీతోఁ గొన్ని రహస్య వచనములు చెప్పి రమ్మన్నది. వినుము. మీ యొద్ద నద్భుతమైన యింద్రజాలవిద్య యున్నదట. ఆ వి‌ద్య శంతనున కీయ నిశ్చయించితివని తెలిసినది. ఎవ్వరికి నీయ వద్దన్నది. నీ కంత మొగమాటమేనిఁ దనయొద్ద దాచమన్నది. అని యుక్తి యుక్తముగాఁ జెప్పి వాని వలలోఁ బడవేసినది. అతండా మాటవిని యుప్పొంగుచు నోహో ? నా కింతకన్న