Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శంతనుని కథ

163

పిలిపించినను బోయినదికాదు. పతి నాఁడే మృతినొందె ననియు దాను విధవననియుం జెప్పుచున్నది. ఇప్పుడు రాజు మరలఁ బెండ్లి యాడునని సంతసించుచున్నది. భర్త కూఁతు పెండ్లి మాటఁ దలపెట్టక తన పెండ్లి మాటయే ముచ్చటించుచుండెనని విని పరితపించుచున్నది. అని‌ మువ్వురు కోటలోని విశేషముల నుడివిరి.

కరభుఁ డా మాటలన్నియును విని వారిం బలకరించి పరిచయముఁ గలుగ జేసికొని యిట్లనియె. అన్నలారా ! మీ రాజువిషయమై మీరు పరిపరి గతులఁ దలఁచుచున్నారు. అతని వృత్తాంతము నంతయు నే నెరుంగుదును. మీ రాజు నాఁడే మృతిబొందెను. శరభుఁడనువాఁడు పరకాయ ప్రవేశముఁ జేసి యిట్టి కృత్యముల గనబరచుచున్నవాఁడు. అని తన కథయు వాని కథయు నా మూలాగ్రముగా వక్కాణించెను.

అంతలో భోజనసమయ మగుటయు వారెల్ల నింటిలోనికింబోయి తృప్తిగా భుజించిరి. శరభుని చరిత్రమును విని పెద్దవాఁడు శంతనుఁడనువాఁడు రహస్య స్థలమునకు కరభుని తీసికొనిపోయి మిత్రమా ? నీవు కొన్ని దినములు మా యింటిలో నుండవలయును. ఈ రాజు తనకుఁ దగిన కన్యకం దీసికొని రమ్మనమని వేపుచున్నవాఁడు. దీని కెద్దియేని యుపాయముఁ జెప్పుము. అని అడిగిన సంతసించుచు గరభుం డిట్ల నియె. అన్నా! నీ విందులకు వెరవకుము. ఇంద్రజాల మహిమంబున నీ రాజును బరిభవింతము గాక. అని చేయదగిన కృత్యము లన్నియు బోధించెను.

అప్పుడు శంతనుండు మిక్కిలి సంతసించుచు నాల్గుదినములు జాగుచేసి మరల రాజునొద్దకరుగుటయు నా రత్నాకరుఁడు శంతనా ! పెండ్లి కూతుం దీసికొని వచ్చితివా ? లేదా అని యడిగెను. దేవా! దేవర సంకల్పము రిత్త పోవునదియా ? అది మనుష్యకాంత కాదు? అప్సరసగావలయు. ఒక చిన్నది మన నగరమునకు వచ్చియున్నది. స్వయంవరమున నా యువతి పతిని వరించునట. తగిన వరుడు దొర‌కొనమి దేశములు తిరుగుచు నిటకు వచ్చినది. ఇప్పురి బాహ్యోద్యానవనములో నున్నది. దేవరఁజూచి వరింపక మానదు అని యా మూఢుని మనస్సు రంజింపఁ జేసెను.

రత్నాకరుఁడు మిగుల నుప్పొంగుచు నయ్యంగనఁ జూపుమని కోరుకొనుటయు నాటి సాయంకాలమున నేకాంతముగా నా ధరాకాంతుని వెంటఁబెట్టుకొని శంతనుం డయ్యుపవనమున కరిగెను. శరభుం డంతకమున్న తన జాలమహిమంబున నద్భుత పుష్పవనాదులఁ గల్పించియున్న వాఁడు గావున నా భూవల్లభుం డా పూవుదోట విశేషములఁ గాంచి పులకాంకిత శరీరుండై శంతనా ! ఈ వింతవన మెవ్వరిది? అక్కాంత యెందున్నది? అని యడుగుచుండ నతండు నవ్వచు దేవర క్రొత్త వారలైతిరా యేమి? పెక్కుసారులీ తోటలోనికి మనము వచ్చియుంటిమే. ------------ అయ్యండజగమన యప్పొదరింటిలో నుండునని పలుకుచు నతని