Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మరికొంతదూరము తీసికొని పోయెను. అప్పుడా రాజు ఓహో ? మనోహరములైన యీ వన విశేషములు చూచినవైనను గ్రొత్త వివలె మోహముఁ గల్పించు చున్నవి గదా. ఈ వింత జానకఁ జూడచవచ్చును. అక్కాంత జూపింపుము. ఊరక నీ వనమంతయు నేల దిప్పెదవని‌ యడిగిన శంతనుండు దేవా! నేనుమాత్రము చూచితినా ? అవ్వనిత యెందు విహరించుచున్నదో వెదకవలయునని పలికి మరికొన్ని పొదరిండ్లు తిరిగి చూచినంత లతాంతములు కోయుచు నొక పొదరింటిలో నా వాల్గంటి కనంబడినది. శంతనుఁడును నృపతియు దన్మనోహర లోకనసాయకపాతవివశ హృదయులై నేలబడిపోయిరి. మరికొంతసరికి లేచి చూడ నేమియుం గనంబడినది కాదు. అప్పుడు శంతనుఁడు రాజు చేయిపట్టుకొని నడిపించుచు దేవా! ఈ చిన్నదాని సౌందర్య మహిమఁ జూచితివా మనము మూర్ఛఁ బోయితిమి. దానిపరిచారికలు కాబోలు నీవలకుఁ దీసికొనివచ్చి పారవై చిరి. నేటి కింటికిం బోవుదము రండు అని పలుకుచు నతని నంతఃపురమునఁ బ్రవేశ పెట్టి శంతనుం డింటికివచ్చి కరభుం గౌఁగలించుకొనుచు మిత్రమా ! నీ సామర్ద్యమతీంద్రియముగదా ! అసత్యమన యెరింగియు నేనును మోహవివశుండనైతి. అని యప్పటికధ యంతయుం జెప్పెను.

కరభుండు మరునాఁడు చేయవలసిన కృత్యములన్నియు శంతనునకు బోధించెను. వాడుకప్రకారము మరునాడు శంతనుఁడు రాజాంతః పురమున కరుగుటయు నరపతి, విరహపరితాపముతో వేగుచు శంతనా ! మరల నయ్యుప వనాంతరమున కరుగవలయు ఆహా ! ఆ మోహనాంగి దేహము మెఱపుతీగవలెఁ గన్నులకు మిరిమిట్లు కొల్పినదికదా ? నేడేమి చేయునో తెలియదు. వేళయైనది. లెమ్ము లెమ్ము అని తొందర పెట్టుటయు శంతనుం డా రాజుతోఁగూడ మరల నా యుపవనమున కరిగెను. నాడు క్రొత్త వింత లందుఁ బెక్కులు కనంబడుటఁ జేసి జనపతి శంతనా? యిది మరియొక వనమాయేమి ? ఈ వింతలతాంతముల నిన్నఁ జూచి‌తిమా? అని యడుగుటయు దేవా! మీ మనస్సు వీనియందు బ్రసరింపపోవుటచే గురుతు తెలియకున్నది ఇది నిన్నటివనమే యని పలుకుచు మరికొంత దూరము నడిపించెను. అం దొకమేడ కనంబడినది.

దానింజూచి రాజు చెలికాఁడా ! నిన్న మన మీ మేడఁ జూచితిమా ? నాతో నిన్నటి వనమేయని బొంకెద వేమిటికి ? అనుడు నవ్వుచు శంతనుఁడు అయ్యయ్యో! మీ బుద్ధి మారినదా యేమి ? ఇది మన క్రీడాసౌధముకాదా ? దేవర యెన్ని పర్యాయములు దీనిలో వసించితిరి. అంతయు మరచిపోయితి రేమిపాపము? నిన్న నా మూలకుఁ బోయితిమి కావున నీ సౌధము కనంబడినదికాదు. అని యేమేమో చెప్పి యతని మనసు చీకాకుపరచెను. అతం డా మాటలనమ్మి అవును జ్ఞాపకము వచ్చినది దీనిలోఁదొల్లి విహరించితిమి. ఆ చిన్నది యా మేడలో వసించినదా యేమి ? చెప్పుము అని యడిగిన యిందే యా సుందరి యున్నదని చెప్పెను.