142
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
కొమరితను నేను జూచివచ్చితిని ఇష్టములేకున్న వేరొకమాటఁ జెప్పుఁడు అమంగళము లాడవద్దు అని పలికెను.
ఆ మాటవిని వారందరు సంభ్రమాశ్చర్యములతో ఏమేమి? నీవు శీలవతింజూచితివా ? ఎందుఁ జూచితివిఁ ఆ చిన్నదాని గురుతెరుంగుదువా ? దాపున నెవ్వ రున్నారు చెప్పుమని యడిగిన నతం డిట్లనియె. నే నంత యెరఁగనివాఁడను కాను. శీలవతీ రూపవతులతో ముచ్చటించుచుండఁ జూచితిని. సందియమున్న నాతో రండు చూపెదనని పలికెనో లేదో, పద పద చూపుమని యా నలువురులేచిరి.
అందరిని వెంటఁబెట్టుకొని యతండు వారి నెలవునకుఁ దీసికొని పోయెను. అప్పుడు బాలికలు నలువురు దొంటిరూపముల నొప్పుచు గద్దియలం గూర్చుండి ముచ్చటించుచున్నట్ల త్యంభాతురులై యరుదెంచిన తండ్రులంగాంచి లేచి పాదములకు నమస్కరించుచు మా తప్పులు మన్నింపుఁడు. బాల్య చాపల్యమునంజేసి మిమ్ముఁ గడు బాములు పెట్టితిమి. తొల్లి మా గురువులు కాశీపురంబున సిద్దతీర్థంబునం గోరిన వరంబులే మా యెత్తి కోలునకుఁ గారణంబులని పలుకుచుఁ దమ తమ వృత్తాంతము లెరింగించి వారినెల్ల సంతోషశోకవిస్మయ రసాయత్త చిత్తులఁ గావించిరి.
ధర్మపాలుఁడు సత్వవంతుని శౌర్యసాహసాది గుణంబు లంతకుమున్నె వినియున్నవాఁడు కావున నతం డట్ల గుటకు మిక్కిలి సంతసించుచుఁ గాలవ్యవధి సైరింపక యప్పుడే సుముహూర్తము నిశ్చయించి తారావళీ సౌగంధికలఁగూడ నచ్చటికి రప్పించి యా కాశీక్షేత్రంబున విశ్వేశ్వరుని మ్రోల దేవతా వైభవముతో వివాహ మహోత్సవములు కావించెను.
సత్వవంతుఁడు తొలుత శీలవతిం బెండ్లి యాడి తరువాతఁ గళావతీ తారావతీ సౌగంధికలకు మంగళసూత్రములఁగట్టి పిమ్మట విద్యావతీ రూపవతుల భార్యలుగా స్వీకరించెను. అట్లు సత్వవంతుండు వారివారి రాజ్య వైభవములతో నార్వుర భార్యలను స్వీకరించి భుజబలంబున మరికొన్ని దేశంబులు సంపాదించి నిజయశోవిసరంబులు దిగంతములకు నలంకారములై శోభిల్ల పూర్వ భూపతులవోలె ధర్మంబున రాజ్యంబు సేయుచుండెను. అతని చరిత్రము విద్వాంసులు గ్రంథములుగా రచించిరి.
గోపా! విను మా సత్వవంతుండు శీల కళా విద్యా రూపవతులతోఁ గొంతకాల మీ నగరముఁ బాలించెను. అతని భార్యలు నలువురు నీ యుద్యానవనమున విహరించుచు నీ తరులతా విశేషంబుల నప్పుడప్పుడు తమతమ నాఅమంబులతో నాటించిరి. దానంచేసి యిందున్న తరులతా జాతులన్నియు నాలుగేని వడుపున నుండుటకుఁ గారణమైనది. సిద్దతీర్థ ప్రభావంబుఁగూడ దీనం దెల్లమైనదికాదే? రెంటికిని నీ కథయే సమాధానమనిచెప్పిన సంతోషించుచు శిష్యుండు గురునితోఁగూడ నా రేయి సుఖముగా వెళ్ళించెను.