Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విచిత్రనాటకము కథ

139

గావించెనో తెలిసికొనవలసియున్నది. నే నా శీలవతి తండ్రిని. యజ్ఞదత్తుండ ఇందు శీలవతియు విద్యావతియు నదిలో మునుంగుట యసత్యమని వ్రాయబడినది. మే మందులకు దుఃఖించుచు దేశముల పాలై తిరుగుచుంటిమి. మీ నాటకప్రకటనపత్రిక యందలి కథాసంగ్రహముఁజూచి యవ్విధముఁ దెలియఁగోరి యిక్కడికి వచ్చితి ననుగ్రహించి యాకృతవర్మం జూపుఁడని వేడికొనియెను.

ఆవెనుకనే మరియొకఁడులేచి అయ్యా! నేనా విద్యావతి తండ్రిని. ధనపాలుండ. నాకన్నె నిమిత్తమే విరక్తిఁజెంది యిప్పురమునకు వచ్చితిని. ఈ కథయందలి నిజానిజంబులు నాకునుం దెలిసికొనవలసిన యవసర మున్నదని చెప్పెను. అప్పుడే వృషాంకుఁడు లేచి తన కులశీలనామంబులు తెలియపరచి సభాప్రవృత్తి యెట్టిదో నుడువుడఁని యడిగెను.

ఆమాటలన్నియు విని యాసభకు వచ్చియున్న ధర్మపాలుండును నిలువంబడి యోహో! నేడెంత సుదినము. ఈ నాటకసమాజమువారు మా కెట్టి యుపకారముఁ గావించిరి? నామిత్రు లందరు నిందే కూడియుండిరి. పుత్రికా వియోగముకన్న నీ యజ్ఞదత్తు నిమిత్తము నేను మిక్కిలి చింతించుచున్నాను. ఈ తండు నా మంత్రి యేదియో నిందించెనని కోపించి మరల నా చెంతకు రాడయ్యెను. నేఁ డీ మహాత్ముం గంటిని. మరియు నీనాటకము వ్రాసినట్లు వారిమరణము లసత్యములై నచో మేము మహా పుణ్యాత్ములముగదా? కృతవర్మ మాకా మర్మ మెరింగించి యనేక దానధర్మముల పుణ్యము నొందుగాక యని యుపన్యసించెను. అప్పుడు సభాస్తరులందరు నామాటలు విని మిక్కిలి యక్కజమందుచుఁ గృతవర్మ వచ్చి యేమిచెప్పునోయని యవనికాభిముఖులై చూచుచుండిరి. అంతలో సూత్రధారుఁడు వచ్చి అయ్యా! నాటక కథలోఁ గొంత బూటక ముండునని మీ రెరింగినదేకదా? ఈ కృతవర్మ వారి వివాహకాలమందుండుటచేఁ గథ నిట్లు మార్చి రచించెనని తలంచుచున్నాఁడ. అయినను గృతవర్మ నేఁడు జ్వరపీడితుఁ డగుట నిప్పుడు మాట్లాడుట కసమర్ధుండై యుండెను. ఈ విషయములు వినఁగోరువారు రేపు మధ్యాహ్న మీ సభకు రా వేడుచున్నాము. ఆతం డా తెఱంగంతయు నప్పుడు వివరింపఁగలడని చెప్పి లోపలికిఁ బోయెను. ఆమాటవిని సభ్యులందరు గోలాహలధ్వనులతో లేచి నాటకశాల వెడలి యవ్వలికిఁ బోయిరి. వీరుమాత్ర మందుఁ గూర్చుండిరి. అప్పుడు కొందరు పరిజనులు వచ్చి మీకింకను గూర్చుండిరేల? తలుపులు బంధింపవలయు నవ్వలికి దయచేయుఁడని వినయముగాఁ బ్రార్దించుటయు మే మా కృతవర్మ మిత్రులము. వానితో మా మాట చెప్పిరండు. పొమ్మన్నఁ బోయెదము. గుప్తవర్మ పిలుచుచున్నాడు. అని చెప్పుడని పలికిన వారువోయి యా మాట చెప్పిరి. కృతవర్మ యతిరయంబున జనుదెంచి గుప్తవర్మ యెందున్నాడని పిలుచుచు నతనిం జూచి బిగ్గరఁ గౌఁగలించుకొని అన్నా! యెట్లు వచ్చితివి? నాఁడేమై పోతివి? -------------- యేమైనం తెలిసినదా? అని యడుగుచుండ నవ్వుచు వీ రెవ్వరో