Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వినత :- సౌమ్యా ! నీకు వైద్యము తెలియునని వింటిని చేయిఁ బట్టి చూచి శిరోభారమున కేదియైనఁ జికిత్స సేయుదువా ?

కృతవర్మ :- (తలయెత్తి చూచి) నాకు వైద్యము తెలియునని నీ కెవ్వండు సెప్పిరి.

వినత :- సకలవిద్యా పారంగతుఁడవని నీ మొగమే చెప్పుచున్నది.

కృత :- విద్యలు మొగముపై వ్రాయబడియున్న వియా యేమి?

వినత :- బ్రహ్మ మొగముననే కాదా వ్రాయునఁట !

కృత :- నాకు వైద్యము తెలియదు. నీ వ్యాధి మరియొకరి నడిగి తెలిసికొనుము.

వినత :- ఇంట నిప్పుడు మరెవ్వరును లేకపోవుటచేతనే నీ యొద్దకు వచ్చితిని. అందరు నాటకశాలకుఁ బోయిరి. నా వ్యాధి యందరకుఁ దెలియదు‌. మీరే కుదర్చవలయును.

కృత :- అది నా కేమియుం దెలియదని చెప్పలేదా? మరల నడిగెన వేమిటికి ?

వినత :- అయ్యో ! మీరు కడు దయార్ద్రహృదయు లనియుఁ బరోపకార పారీణులనియు నెల్లరు స్తుతియించుచున్నారే. నన్నిట్లు కసరుచున్నారేల ? నా వ్యాధి యేదియో తెలిసికొనఁ జాలకున్నను బరీక్షించరాదా ? శరణుఁ బొందినదాని విడుచుట న్యాయమా ?

కృత :- ఓహో ! నీ మాటలు నా కర్దములుకావు. నా శరణు నీ కేమిటికి? నాకు వైద్యము తెలియదనిన నేమేమో చదివెదవేల ?

వినత :- నా చేయిఁ బట్టరాదని తలంచుచుంటిరాయేమి ?

కృత :- చేతకానివాఁడ ముట్టియు నేమిచేయుదును ?

వినత :- ముట్టినపిమ్మట నన్నియు మీకే తెలియగలవు. సమర్దులిట్లే పలుకుచుందురు. (అని చేయి చాపినది.)

కృత :- (చేయిపట్టుకొని ధాతుపరీక్షఁజేసి) రోగమేదియుం గనంబడలేదే ?

వినత :- నీ కరస్పర్శము తగిలినతోడనే పటాపంచలైనది.

కృత :- అట్లయిన లెస్సయే. ఇఁక నింటిలోనికిఁ బొమ్ము.

వినత :- ‌ వీధితలుపులు వైచివచ్చితిని. తొందరలేదు. నీవు తృటిలో రోగనివారణఁ జేసితివి. అందులకుం బ్రతిఫల మీయవలయునని యాలోచించు చుంటిని.

కృత :- నీవు నా కేమియు నీయనక్కరలేదు. అవ్వలికి బోవుటయే పారితోషికము.