పుట:కాశీమజిలీకథలు-06.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

శిష్యురాలు గలిగియన్నది. ళాల్యన్నములు భుజించి పనిపాటలులేక వీరందరు నాఁబోతులవలె బలిసియున్నారు. వీరి నందరిని పొమ్మని యీ సత్ర మెత్తివేయించుట లెస్సయని పలికిన నతం డంగీకరింపక నిది మొదలు యోగిను లీ మంఠపములో నుండరాదు. పది దినములలో నందరును లేచిపోవలయునని యాజ్జయిచ్చి ప్రధానులతోఁగూడ నా ఱేడు నగరికిం బోయెను.

కమల యావార్త విని యార్తిఁజెందు డెందముతో నౌరా! నాచరిత్ర యెంత చిత్రముగానున్నది. నా కతంబున యోగినులకెల్ల నపకారమైనదిగా ? పాప మీ చిదంబరయోగి నూరేండ్లవాఁడు. ఇట్టి వారినింగూడ స్త్రీ సాన్నిధ్యంబునం జేసి లోకులు శంకించుచున్నారు. ఇంతకన్న నవివేకమున్నదియా । నా నిమిత్తమై యా కపట శిష్యులే యీ పనిఁ గావించిరి. అన్నన్నా ! నా మంచమందే యుంచినచో నన్ను వీండ్రు మోసము చేయుదురుగదా ? సీ ! ఆఁడురూపమునఁ జనించుటకంటెఁ గ౦టకము మరియొండు లేదు. నేను సత్వవంతుని నిమిత్తము మగరూపు విడచి యీ యాడురూపుఁ దాల్చితిని. ఇందు రసాభాసమైనది. సత్వవంతుండిఁక రాడు. నే నన్నింటికిం జెడితిని. ఈ యాడురూపము వానియెదుటనే ప్రకటించితినయేని యెంత యొప్పిదముగా నుండును. ఇఁక వానిం జూచుభాగ్యము నా కన్నులకుఁ గలుగదు. పోనిమ్ము. చిదంబరయోగి నా వృత్తాంతమువిని నిన్నుఁ గాశికిఁ బొమ్మని శెలవిచ్చియున్నాడు గదా! ఆయన మిగుల వృద్దుఁడు. జ్ఞానవంతుఁడు. ఆయనమాట వడువుననే కావించెదనని నిశ్చయించి కమలయను పేరుతో నున్న రూపవతి మరలఁ బురుషవేషము వైచికొని యటఁగదలి కతిపయ [పయాణంబులఁ గాశీపురంబున కరిగినది.

అని యెరింగించి అవ్వలికథ మణిసిద్ధుండు తదనంతరావ సథంబున నిట్లు జెప్పం దొడంగెను.

డెబ్బది మూడవ మజిలీ కథ

ఆహా ? లోకమెంత మోహక్రాంతమై యున్నది. అన్నియుం దాను జేయుచున్నట్లు తోచును. నిక్కమరయ జనుడు రవ్వంతయు! దాను జేయుటకుఁ గర్త కాడు. భ్రమపడి కర్తృత్వము తనపైఁ బెట్టుకొనును. తాను జేయఁ బూనిన పనులే పిమ్మట విమర్శింప విపరీతములుగాఁ దనకే తోచును. ఆచరింపబడినది మార్చుటెట్లో శక్యముకాదో జరుగఁబోవునదియుఁ దెలిసినను మార్చుటకు శక్యముకాదు. ఆ రహస్య మెరుఁగక ప్రమాదము జేసితిమనియుం ముందు జాగరూకతగాఁ జేయుదు మనియు సంకల్పించు చుందురు. అది వట్టిదబ్బర. కాకున్నది కాకమానదను నార్యోక్తి శిలాశాసనమువంటిది. అందులకు మా చరిత్రమే దృష్టాంతము. మేము గొప్ప సంపదలు కలవారియింటఁ బుట్టియు సుఖపడనేరక కన్నవారి దుఃఖముల పాలుఁజేసి యిల్లువిడిచి దేశముల పాలైతిమి. మే మిట్లు చేయుటకుఁ గారణమేమియుఁ