Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థూలజంఘ తామ్రకేశుల కథ

115

ముగా జరుగుచున్నవియా యని యడిగిన వారందరు నేకకంఠముగా మహాప్రభూ ! మా కేమియు లోపములేదు. ఉపచారములన్నియు బూర్ణముగా జరుగుచున్నవని చెప్పిరి.

పిమ్మట నతండు మంత్రులతో ముచ్చటింపుచు మఠవిశేషములఁ జూచుచు దిరుగుచుండ నొకదండ నంతఃపురంబునఁ గావలి యుండెడు సౌవిదల్లుఁడు కనంబడి నమస్కరించుటయు రాజు గురుతుపట్టి నీ వమ్మగారి ప్రతీహారివికావా? ఇందేమిటికి వచ్చితివనిన నతం డిట్లనియె.

దేవా ! నేను పరిచారకుండ నట్టివాఁడనే. అమ్మగారు ఇందున్న చితంబర యోగిగారివద్ద కరిగి మంత్రభస్మముఁ దెమ్మని యంపగా వచ్చితిని. అ య్యోగీంద్రుండు ప్రొద్దుటినుండియుఁ గనంబడుటలేదు. ఎందుఁబోయినది తెలియదు. ఎవ్వరి నడిగినను జెప్పకున్నారని చెప్పిన నన్నరేందుఁ డందు నిలువంబడి చిదంబరయోగి యెం దున్నవాఁడని కింకరులచేఁ గేకలు వేయించెను. ఆ యోగి బ్రతివచనము వినంబడలేదు. ఆ దాపుననున్న సన్యాసు లాయన నేటి యుదయమునుండియు గనంబడుటలేదు. ఎందుఁ బోయెనో తెలియదని చెప్పిరి.

అట్టి సమయమరసి స్థూలజంఘుఁడు దేవా ! నేనా యోగి శిష్యుండనే తమరు మన్నింతురేని వక్కాణించెదమని సంశయాకులిత మతియుంబోలె పలికిన విని రాజూ మన్నింతుము. సత్యముఁ జెప్పుము అని చెప్పెను. అప్పుడా మాయావి వారినెల్ల వెంటఁబెట్టుకొని యా గుడియొద్దకుఁ బోయి తలుపుతీసి వారిం జూపుచు వీరే మా గురువులు. శిష్యురాలికి రహస్య మంత్రోపదేశముఁ జేయుచున్నారని పలికెను.

చిదంబరయోగి మంచముపైఁ గూర్చుండెను. కమల ప్రక్కను నిలువంబడి యున్నది. వారింజూచి రాజు ముక్కుపై వ్రేలు వైచుకొని భళిరా ! మకరాంకా ! నీ చేష్టలు కడు విపరీతములుకదా ! ఈ వృద్ధతాపసుఁ డేడ? ఈ బాలయోగిని యేడ ? ఎట్లు సంఘటించితివి. అని విస్మమయముఁ జెందుచు మహాత్మా ! యోగింద్రా ! మీరిందుఁ జిక్కితిరేల యని పరిహాసపూర్వకముగా నడిగెను.

కమల వారింజూచి తలుపుచాటునకుం బోయినది. చిదంబరయోగి రాజుగా నెరిఁగి మెల్లన మంచముదిగి యీవలకు వచ్చి దేవా ! మా కిదియొక ప్రారబ్ధము. దీనిలోనికి నే నెట్లు వచ్చితినో చెప్పఁజాలను ? రాత్రియెల్ల నే నిందుఁ బడినబాధ దైవమెరుఁగును. నా శిష్యురాలు నన్నుఁ జూడవచ్చినఁ దలుపులువైచి యెవ్వఁడో పారిపోయెనని యా కథ యంతయుం జెప్పెను.

నమ్మకము చెడినపిమ్మట నెంత సత్యముఁ జెప్పినను విశ్వాసము గలుగదు గదా ! శశాంకుఁ డయ్యతి వచనములయం దాదరము వహింపక మంత్రుల మొగముఁ జూచుటయు వారు దేవా ! ఇందున్న యోగులందరు నిట్టివారే ? ప్రతిసన్యాసికిని