పుట:కాశీమజిలీకథలు-05.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

324

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అప్పుడు నేను గన్నుల నీరుగార్చుచు నంజలి ఘటించి, దేవా! నేను మిత్రశోకాంధత్వంబున నిన్ను దాటితిని గాని తిరస్కారభావంబునంగాదు. అనుగ్రహించి యాశాప ముపసంహరింపుమని వేడుకొనుటయు నతండు వెండియు నిట్లనియె.

ఆర్యా! నా శాపము త్రిప్పనలవికాదు. నీవు గుఱ్ఱమవై యెవ్వని వహింతువో వాని యవసానమున స్నానము చేసినంత ముక్తుండువయ్యెద. విదియే నాచేయు నుపకారమని పలికిన నే నిట్లంటి.

దేవా! అట్లయిన నేనొండు విజ్ఞాపనజేయుచున్న వాఁడ శాపదోషంబున నా మిత్రున కిప్పుడు చంద్రునితోఁగూడ బుడమియందుఁ బుట్టవలసియున్నది కావున దేవర దివ్యదృష్టిచేజూచి యశ్వజన్మమందు సైత మతనితోఁగలసి కాలము గడుపున ట్లనుగ్రహింపుము. ఇదియే నా కోరికయని పలికిన విని యతం డొక్కింత విచారించి యిట్లనియె.

ధాత్రి నుజ్జయినీపురంబున నపత్యమునకై తపంబుజేయుచున్న తారాపీడునకుఁ బుత్రుండై చంద్రుం డుదయించును. నీమిత్రుండు పుండరీకుండును దదమాత్యుండైన శుకనాశునికి జనియించుం గావున నీవా రాజపుత్రుని యశ్వరత్నమై యుదయింపుము. నీయందుఁగల ప్రేమచే నింత దలంచితి పొమ్మని పలికినతోడనే నే నధోభాగము జూచి సముద్రములోఁ బడి యశ్వమై పుట్టితిని. అట్టి జన్మమునందుగూడ నాకు జాతిజ్ఞానము కలదు. కావున నశ్వముఖమిధునము గనంబడినతోడనే వెంటంబడి యీ భూమికి దీసికొని వచ్చితిని. చంద్రాపీడుఁడు చంద్రుని యవతారము. పూర్వజన్మానురాగంబున ని న్నభిలషించి నీ శాపాగ్నిచే దగ్ధుండైన వైశంపాయనుఁడే పుండరీకుఁడని పలికి యూరకుండెను.

ఆ మాటవిని మహాశ్వేత, హా! దేవ! హా! పుండరీక! నీవు లోకాంతరగతుండవైనను నిన్నే స్మరించుచుంటిని? ఈ రక్కసితో నీకేమి ప్రయోజనమున్నది. నేను వినాశముకొరకే జనించితిని కాబోలు నన్ను సృష్టించి దీర్ఘాయు వొసంగుట పరమేష్టి కేమి ప్రయోజనమో తెలియకున్నది. నే సమసితినేని నీకియాపద రాకుండును గదా! ఇప్పుడు నేనేమి చేయుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? రక్షించువారెవ్వరు? అయ్యో! అయ్యో! ఇంచుకంతయుఁ దెలిసికొనలేకపోయితినే? యని యనేక ప్రకారముల విలపించుచు నురముబాదుకొనుచు నేలంబడుటయుంజూచి కపింజలుఁ డిట్లనియె.

గంధర్వరాజపుత్రీ! నీవిట్లు నిందించుకొనియెదవేమిటి? నీయందేమి దోషమున్నది? వెండియు నిప్పుడు దుఃఖించుట కవసరమేమివచ్చినది? యలఁతితరిలో సుఖమే యనుభవింపఁగలవు మీయిరువురు తచ్ఛాపాంతమునఁ బతులతో గలిసి కొందురు. అశరీరవాణిని మీరు వినియుంటిరికదా! అంతదనుక తపంబే చేయుచుండుఁడు. తపంబున నన్ని కార్యములు చక్కఁబడును. తపంబునంగాదే! శర్వాణి