పుట:కాశీమజిలీకథలు-05.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

299

అని యిట్లుత్తరము వ్రాసి మడిచి యీ పత్రికం గేయూరకముఖముగాఁ గాదంబరి కందింపుమని మేఘనాథునితోఁ జెప్పుచు, వైశంపాయనుని స్కంధావారముతో మెల్లగా రమ్మని నియమించి తానతిజవంబున నింద్రాయుధ మెక్కి వారవపు రౌతులు సేవింప కతిపయప్రయాణముల నుజ్జయినికిఁ బోయెను.

ఆకస్మికముగా నతండు వచ్చుటచేఁ బౌరులు సంభ్రాంతులై సంతసించుచు నెదురువచ్చి నమస్కరింపుచుండఁ గైకొనుచు నతండతర్కితుండై రాజనగరిఁ బ్రవేశించెను.

అప్పుడు ద్వారపాలు రతని వార్త ఱేనికి నహమహమికఁగాఁ బోయి చెప్పిరి. యా వృత్తాంతము విని తారాపీడుఁడు పట్టరాని సంతోషముతో నతనికిఁ గొంత దూర మెదురేగెను.

చంద్రాపీడుఁడును దూరమునందే తండ్రిం జూచి తురగమునుదిగి యతని పాదంబుల సాష్టాంగముగా బడిఁ నమస్కరించెను.

అతండు నప్పుడు పుత్రకుని గ్రుచ్బియెత్తి గాఢముగా గౌఁగలించుకొనుచు నప్పుడే విలాసవతీ భవనమునకుఁ దీసికొనిపోయెను.

ఆమెయుఁ బుత్రునింజూచి యపార సంతోషముతో వదనము వికసింప నాలింగనము చేసుకొని యాత్రామంగళములు దీర్చుచు దిగ్విజయ యాత్రా సంబద్ధములగు కథలచేఁ బెద్దతడవందుంచు కొనియెను.

చంద్రాపీడుఁడు పిమ్మట శుకనాశుని యింటికిఁబోయి వైశంపాయనుండు స్కంధావారముతో వచ్చుచున్నాడని చెప్పి, మనోరమకుఁ బ్రీతి గలుగఁజేసి యా దివసమంతయు తల్లియొద్దనేయుండి మరునాఁడు తనదగు కుమారభవనమునకుఁ బోయెను.

అతిమనోహరమగు నమ్మందిరము కాదంబరీవియోగచింతాసంతాపంబునఁ దొట్రుపడుచున్న యక్కుమారుని హృదయమునకు శూన్యంబువలె దోచినది.

అట్టి పరితాపముతో నతండు గొన్నిదినములు గడిపినంత నొకనాఁడు మేఘనాథునితోఁగూడ పత్రలేఖ హేమకూటమునుండి వచ్చుటయు దూరమునందు చూచి మోము వికసింప నమస్కరింపుచున్న దాని గ్రుచ్చియెత్తి మిక్కిలి గారవింపుచు నించబోణీ! కాదంబరీ మహాశ్వేతలు సుఖులే కదాయని యడిగిన నప్పుడఁతియు వారి యనామయము జెప్పి, వెండియుం గాదంబరి తమసేమ మడిగినదని వక్కాణించెను.

అప్పు డతఁడయ్యింతి చేయి పట్టుకొని యభ్యంతర మందిరమునకుఁబోయి యందు స్థలకమలినీపలాశచ్ఛాయచేఁ జల్లనై యున్న మరకతశిలామంటపమున నిద్రించు మరాళమిథునమును దోలి యందు గూర్చుండి యల్లన దానితో నిట్లనియె. పత్రలేఖా! నేను వచ్చిన తరువాత నచ్చట జరిగిన విశేషము లెట్టివి? నీవందెన్నిదినము లుంటివి? నిన్నెట్లు చూచినది? యేమేమి గోష్ఠి వచ్చినది? కాదంబరి నామాట యెప్పు