పుట:కాశీమజిలీకథలు-05.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

121

రుండు నియమించిన సంకేతసమయమునకు వచ్చునట్లు నిశ్చయించి యెచ్చటికో పోయెను. పదంపడి శంకరయతి యా రహస్యం బెవ్వరికిం దెలియనీయక యమ్మరునాడు శిష్యులందరు స్నానాది వ్యాపారతంత్రులై తలయొకచోటికిం బోవ నిరూపింపబడిన రహస్యప్రదేశంబున సనందనుండు దెలిసికొనునేమోయను వెరపుతో నిగూఢుండై యున్న సమయంబున.

క. కేలఁ ద్రిశూలము గొని కం
   కాళాలంకృతులు మేనఁ గ్రాలఁ ద్రిపుం డ్రో
   త్కీలితఫాలుండై కా
   పాలికుఁ డేతెంచె నరుణభయదాక్షుండై.

అబ్భైరవాకారు రాకంజూచి యమ్మహాత్ముం డింద్రియముల నుపసంహరించుకొనుచు స్వాత్మను బరమాత్మయం ధైక్యానుసంధానము గావించి జత్రుప్రదేశంబున గడ్డంబు మోకాళ్ళమీఁద మూచేతులు నునిచి మోము దెరచుచుఁ గన్నులు సగము మూసికొని సిద్ధాసనమున గూర్చుండి సమాధిచేఁ బ్రపంచకమంతయు మరచి యున్న సమయంబున నా భైరవుం డయ్యతీంద్రుఁ జంపుటకు నించుకయు సంశయింపక సంతోషముతోఁ ద్రిశూలమెత్తి యతని కంఠం బుత్తరింపఁబోవునంతలో దైవప్రేరితమైన బుద్ధిచేతఁ బద్మపాదుం డేమిటికో యచ్చటి కరుదెంచి గురుని శిరంబు దరుగఁ బ్రయత్నించు నా క్రూరుని యుద్యమంబు జూచి తొందరపడుచు నాత్మీయాభీష్టదేవతయైన శ్రీమన్మనృసింహు సమంత్రకముగా ధ్యానించుటయు.

సీ. భూరిసటాద్ఛటాస్పోటవంబుల మింట
           జీమూతసంఘము ల్బెదరిపోవ
    దంష్ట్రాకరాళవక్త్రచ్ఛిద్రసంజాత
           పావకార్చుల జగత్ప్రతతి గమలఁ
    బెడుబొబ్బ వెట్టి కుప్పించి దాటినవేగ
          మున భూతసంతతు ల్మూర్ఛనొంద
    నిది యేమి యని వేల్పులెల్ల దల్లడమంద
          జలనిధు ల్మిగుల నాకులత నొందఁ

గీ. బద్మపాదుండు నరసింహవర్యరూపుఁ
    డగుచు రయమున నురికి శూలాయుధమున
    నాత్మగురుఁ జంప గమకించు నద్దురాత్ము
    పొట్టఁ జీలిచి వెసఁ గాలుప్రోలి కనిచె.