పుట:కాశీఖండము.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

435


దివ్యలింగంబు భాగీరథీతటంబు
నందు మణికర్ణి కాహ్రదోపాంతభూమి.

38


విశ్వకర్మేశ్వరలింగప్రాదుర్భావము

వ.

దూర్వాసేశ్వరలింగంబు సర్వాభీష్టఫలప్రదాయకంబు. మఱి విశ్వకర్మేశ్వరలింగంబు ప్రాదుర్భావంబు వివరించెద సావధానమతివై యాకర్ణింపుము. త్వష్టృప్రజాపతికొడుకు విశ్వకర్మ బ్రహ్మచర్యంబున భిక్షాన్నభోజియై గురుగృహవాసియై విద్యాభ్యాసంబు చేయుచుండె నంత.

39


సీ.

వానకాలము వచ్చె వర్షంబు లందందుఁ
        జడివట్టి కురిసె నాసావియందు
గురుఁడు నాకొక్కమందిరము నిర్మింపుమీ
        వర్షధారలచేత నుఱియకుండ
గురుపత్ని నాకొక్కకుపసంబుఁ గుట్టుము
        చలిగాలి యొడలిపైఁ బొలయకుండ
గురునందనుండు నాకు రచింపు పావాల
        నడుసు పాదంబుల నంటకుండ


తే.

గురుతనూభవ నాకు బంగరువుతొడవు
[1]వజ్రభూషలు సేయు తాల్పంగవలయు
ననుచుఁ బ్రార్థించి రందఱ కతఁడు మ్రొక్కి
యిన్నియును దాను గల్పింప నియ్యకొనియె.

40


వ.

ఇవ్విధంబున గురునకు గురుపత్నికి గురుపుత్రులకు గురుతనూభవకు, వారలు కోరినయర్థంబులు సంఘటింప నను వెఱుంగక చింతాక్రాంతుండై యుండెనంత దైవయోగంబున

  1. 'వజ్రభూషణములు నాకు వలయుఁ దాల్ప' అని వ్రాఁతపుస్తకము.