పుట:కాశీఖండము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

శ్రీకాశీఖండము


యనంతరంబ యంతంత నుట్టిపడు నట్టిసలిలబిందువులన రజనీశుక్తిముక్తాఫలంబులు నక్షత్రంబు లంతరిక్షంబున సంప్రేక్షణీయంబులయ్యె. దాక్షారామకటకాప్సరస్తాటంకినీవదనారవిందలావణ్యబిందునిష్యందంబు చందురుండు కందర్పదిగ్విజయకీర్తిస్ఫూర్తియుంబోని యచ్చవెన్నెల విచ్చలవిడిం గాయందొడంగె. కుముదంబులు ముదం బందె. లాంగలి చెంగలించె. ఱె ల్లుల్లసిల్లె. కాసర గాచె. దొస దోరగిలం బారె. పయ్యెద విసరె. వాడిమందటిలియె. కరి మదంబుఁ గురిసె. నందిపోతు పోతరించి ఖణిల్లున ఱంకె వైచె. అసలడుగువడియె. నెఱిని నిసుక దెస దీవి చూపె. నీడ సవియయ్యె. ఏకాకులపొన్న క్రొన్నన పెరిఁగె. వరిగ విరిగె. గసగస యెసక మెసఁగె. పెస రుసురుకొనియె. తవిద పొదలె. ఱెక్కప్రాసంగు దొండముక్కపడియె. మదకలకలహంససంపద సల్లాపకోలాహలవ్యాజృంభకరంభితకకుబంతంబులై(న) విహారవేశంతంబులు కాంతాకుచద్వయ ద్వయసవాఃపూరవంతంబు లయ్యె నయ్యవసరంబున.

23


తే.

కార్తికపువేళ భీమశంకరునినగర
వింధ్యసంస్తంభయిత దూరె విమలబుద్దిఁ
దొయ్యలియుఁ దాను జిచ్చఱతోరణంబు
కలుషసంహతిసంహారకారణంబు.

24


క.

దక్షిణవారాణసి యగు
దాక్షారామంబు సొచ్చి తరుణేందుధరున్
వీక్షించినకోలెను గా
శీక్షేత్రాలోకసుఖమ చేకుఱె మునికిన్.

25