Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకార్ధము

క.

మలయసమీరము మలసెను, మలఁగొనియెఁ బటీరశైలమారుత మనుచుం
బలికిన యర్ధమ క్రమ్మఱఁ, బలుకుట యేకార్ధ మండ్రు ప్రతిభావంతుల్.

119

అతిమాత్రము

క.

అతిమాత్రం బగు నతిభా, షితమున నేకోదకమునఁ జెడు జగ మనుచున్
మితముగ నరిసతు లేడ్చినఁ, బ్రతతాకృతి నదులు వర్వె బాష్పజలములన్.

120

భిన్నసంబంధము

క.

నలువ భవదహితకీర్తులు, నలుపులు గావించుతలఁపునం జేసి సుమీ
మలినత్వము కుజనమనః, స్థలముల నిడె ననఁగ భిన్నసంబంధ మగున్.

121

అపక్రమము

తే.

పురుషుఁ డొక్కండు పరిణయంబునకు మున్న
వరుస సమకూర్చె సీమంతపరికరములు
అన నపక్రమ మండ్రు [1]కృత్యంబు గడచి
[2]యవలిపని సేయు నని [3]చెప్పునట్టికృతుల.

122

పరుషము

క.

వేఁడెడునర్థులఁ గనుఁగొన, వాఁడికుఠారమునఁ జెండవలదా యను [4]నీ
సూఁడరిమాటల పరుషము, [5]పోఁడిమి చెడు నట్టియర్థములఁ గబ్బములన్.

123

అసదృశోపమ

క.

వసుధాపతి కోపాగ్ని, ప్రసరంబులచేత రజతపర్వతభంగిన్
వెస వెలిఁగెఁ బోర ననఁగా, నసమత నిది యసదృశోపమాహ్వయ మయ్యెన్.

124

అప్రసిద్ధోపమ

తే.

బాష్పకణకీర్ణ మై యొప్పుఁ బణఁతిమోము
మంచు నిండినతొగపువ్వుమాడ్కి ననిన
నప్రసిద్ధోపమార్థ మై యడరు నండ్రు
కుముదముఖముల కుపమాప్తి గూడ కునికి.

125

హేతుశూన్యము

తే.

[6]చర్మగోరక్షణార్థంబు చంపుఁ బులుల
ననక మిన్నక పులివేఁట లాడు నృపుఁడు
శూరుఁ డై యన్న నది హేతుశూన్య మయ్యె
నిష్ప్రయోజనకథన మై నివ్వటిలుట.

126
  1. క.గ.చ. కృత్యంబు గదిశి
  2. క.గ.చ. ఔలఁ బని సేయునని
  3. క.గ.చ. చెప్పునట్టికవిత
  4. క. నీచూడరిమాటలు, గ. నీచూడనిమాటలు
  5. క.గ.చ. పోడిమి చెడునిట్టి
  6. గ. శర్మగోరక్షణార్థంబు