Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

[1]ధారామండితసాలభంజికలచేతన్ జిత్ర[2]యంత్రోద్గళ
త్సారామోదతుషారపూరములు [3]విస్తారంబు లై పర్వుఁ గాం
తారూఢేక్షణదీప్తితోడన చళుక్యాధీశుపైఁ జంద్రవం
శారాధ్యుం డని చంద్రికాగణము నిం పై క్రాలుచందంబునన్.

102

ప్రావృడ్వర్ణనము

క.

తటిదటనమేఘపటలీ, ఘటితాంబరశక్రచాప[4]కరకావ్రాత
స్ఫుటధారాసారాదివి, కటత నుతింపంగవలయు ఘనకాలమునన్.

103


మ.

చపలాలోకములుం బయోధరగరిష్ఠశ్రీయు [5]సద్యోల్లస
ద్విపులానందము [6]నంబరాభరణసద్వేషంబునుం గంకణ
స్థపుటారావము సొంపు మీఱఁ దగువర్షావేళ విశ్వేశ్వరా
ధిపు [7]సేవించు ప్రగల్భకామినిగతిన్ దీపించు భావింపఁగన్.

104

శరద్వర్ణనము

క.

వెన్నెల సొంపును జుక్కల, చెన్నును దెలుపారుదెసల చెలువంబులు ని
చ్ఛిన్నము లగుజలదంబుల, సన్నుతి సేయంగవలయు శారదవేళన్.

105


శా.

సోమశ్రీలకు [8]వన్నె వెట్టును, [9]ఘనస్తోమంబునం బర్వునా
శామాలిన్యము నౌలఁ ద్రోచు, [10]నవరాజద్రాజహంసావళిం
బ్రేమంబుం బచరించు మానసమునం బెం పై, శరద్విభ్రమం
[11]బామోదప్రద యైనవిశ్వవిభు నుద్యత్కీర్తికిన్ సాటి యై.

106

హేమంతవర్ణనము

క.

[12]బలవత్కాలీయకకం, బళఘనకౌశేయపట్టపటమాంజిష్ఠం
బులఁ జనదు సీతు యువతుల, వలిచన్నులఁ దక్క ననుచు వలయుం బొగడన్.

107


మ.

తరుణీయౌవనగర్వజృంభితకుచోదగ్రోష్మగంధంబులన్
వర[13]కాశ్మీరససాంకవాగురురసవ్యాసక్తులం [14]బట్టికాం
బరమాంజిష్ణపటాదులన్ హిమగతిం బ్రాపింప రీవిశ్వభూ
వరు మెచ్చించిన సత్కవీంద్రు లతులావాసంబులం దిమ్ములన్.

108

శిశిరవర్ణనము

క.

భృశవిచ్ఛిన్నం బగు ది, గ్దశకంబును గమలరుహవితానముఁ బ్రాతః
ప్రశిథిలరవికరమును గా, శిశిరముఁ బొగడంగఁ దగు విశేషక్రియలన్.

109


చ.

వెరవున నాత్మవంశ్యుఁ డగువిశ్వనరేశ్వరుమీఁది ప్రీతిఁ జం
దురుఁడు తుషారసంహతుల దొడ్డుగఁ బంచిన వచ్చి యిచ్చటన్
బరిగొనఁ బోలు నరౌచుఁ జెడి పాఱినవైరులు భీతిఁ గానలో
దిరముగ నిల్వనేరరొ కదే యని [15]చూతురు పంద లాత్మలన్.

110
  1. క.గ.చ. ధారామందిరసాలభంజికల
  2. క. యంత్రోద్గరత్సారామోద
  3. క. విస్తారంబులై పర్వ
  4. గ.చ. కరకాపాతస్ఫుట
  5. క.గ.చ. నవ్యోల్లసద్విపులానందము
  6. క.గ.చ. అంబరాభరణసంద్వేషంబు
  7. క. సేవించి ప్రగల్భకామినిగతిన్
  8. క.గ.చ. వన్నె వెట్టుచు
  9. క.గ.చ. వనస్తోమంబునం బర్వు
  10. క.గ.చ. నతరాజద్రాజహంసావళిన్
  11. క.గ.చ. ఆమోదప్రదమైన
  12. క.గ.చ. బలవత్కౌళేయక
  13. క.గ.చ. కాశ్మీరరసాంకవాగురు
  14. గ.చ. పట్టకాంబర
  15. క. చూతురు బంద లాత్మలన్