Jump to content

పుట:కామకళానిధి.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"అట్టి మదనదేవాధిష్ఠితంబగు తృతీయపురుషార్ధంబు పరలోకసాధనంబగు ధర్మశాస్త్రంబుకన్న నిహలోకసాధకంబగు కామశాస్త్రంబు మతిమంతులగువారికి మోక్షసాధకంబగు నది యెట్టులనిన,

"ధర్మావిరుద్ధోలోకేస్మిన్ కామోస్మి భరతర్షభ"

అను భగవద్వచనప్రామాణ్యంబున ధర్మార్థంబుల ననుసరించిన కామంబు కామత్వంబునొసంగు. స్వకాంతామాత్రకృతకామకళావిశేషంబుల బుత్రసంతతి గల్గుటం జేసి పరలోకసాధకంబగు. గార్హస్థ్యధర్మంబున సౌఖ్యావహంబగుట నిహలోకసాధకంబగు. మరియు జ్యోతిష్టామాదులకు నవియు ఫలంబులగుటను, “అపుత్రస్యగతిర్నాస్తి స్వర్గోనైనచ నైవచ” అను వచనంబునకు విషయంబనియుకు, గామశాస్త్రంబు గ్రాహ్వంబని కాదె వాత్స్యాయనాది మహామునులు దీనివిధంబు తేటపరచిరి." ఈమహాకవి కవిత్వమునుగూర్చి యొక్కవాక్యమును వ్రాసి విరమించెదను.

ఈతని కవితాలలామ మృదుమధురపదవిలసితయై, భావగాంభీర్యభాసురయై పద్మినీజాత్యాదిసఖీజనులతో చౌశీతిబంధప్రాకారవిరాజితమగు మదనసామ్రాజ్యమున బ్రహ్మానందముగ నతిమనోహరముగ గ్రీడించు కోమలాంగులకు కులుకులు నేర్పుచున్నది.

ఈ గ్రంధా౦తమున “కామకళ” అను నామంబున ప్రాచీనాధునికమహాకవులచే రచియింపబడి ముద్రించిన గ్రంధములనుంచి కొన్నిపద్యములను సుజనమనోవికాసమునకు గాను ముద్రించితిని. ఆంధ్రపండితబృందము ప్రాచీనగ్రంథములను ప్రకటించి ప్రకాశకులకుకూడ కొంత సహాయము గావించి యాంధ్రసారస్వతము నభివృద్ధి పరచగలందులకు ప్రార్థించుచున్నాను.

చెన్నపురి

అక్షయవైశాఖశుద్ధ

గంటి సూర్యనారాయణ శాస్త్రి.

సప్తమి; బుధవారము