పుట:కామకళానిధి.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీః

ఆంధ్రపండితుల కొక మనవి.

ఆంధ్రసారస్వతప్రపంచమున నెన్నియో యుద్గ్రంథములు తాళపత్రములపై లిఖియింపంబడి, పండితబృందమున కందుబాటుగాక ప్రకటించుటకు తగు సహాయములేక శిథిలమగుచు, చెదపురుగుల కాహారమగుచు, నాంధ్రవాఙ్మయము నభివృద్ధిపొందింపజాలక యున్నవిషయము యాంధ్రపండితులందరికి విదితమైయున్నది. ఇట్టి దుస్థితిని తొలంగిచుటకును, ఆంధ్రవాఙ్మయప్రపంచమును అభివృద్ధిపరచుటకును, ఆంధ్రసారస్వతప్రవాహమును సర్వత్ర ప్రవహింపజేయుటకును, నిశ్చయించి నవరసములలో శృంగారరస మగ్రగణ్యంబగుటంజేత ప్రప్రథమమున శృంగారసభరితమగు శ్రీ నెల్లూరి శివరామకవి ప్రణీతమగు కామకళానిధి అను యీశృంగారశాస్త్రమును బ్రకటించి పండితలోకమునకు సమర్పించుచున్నాను. ఈశాస్త్రగ్రంథమును యథామాతృకముగ ముద్రించితిని. మాతృకలో లభించనిపదములకు చుక్కలు పెట్టి విడచిపెట్టితిని. ఇందలి గుణదోషములు పండితులు పరిశోధించి తెలియజేయగలందులకు కోరుచున్నాను. ఈ మహాకవి నామగోత్రాదు లీక్రిందుపద్యము నిలన సహృదయులకు విశదము కాగలదు.

చ.

హితుడవు పాకనాట నుతికెక్కిననెల్లురి వంశజాతుడీ
వతులితసాహితీపటిమ యాదవరాఘవపాండవీయమన్
గృతిగలవీరరాఘవ కవీంద్రసుతుండవు కొద్దివాడ వే
తతమతి సంస్కృతాంధ్రకవితానిరతా శివరామసత్కవీ.

ఈమహాకవి యీశాస్త్రగ్రంథమును చతుర్ధ పురుషార్థమగు మోక్షసార్థకంబుగ రచియించినట్లు యీ క్రింది వాక్యములవలను తెలియగలదు.