పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రాజరూపంబు దాల్చినరాజమౌళి, యనఁగ రాజీవబాంధవుఁ డనఁగ మేరు
శైల మనఁ బారిజాతభూజాత మనఁగ, భూతిరుచిధైర్యవితరణస్ఫురణఁ దనరె.

8


క.

యుగపద్వ్యాపకశశభృ, జ్జగదంబకబింబితప్రశస్త యశస్తు
త్యగురుప్రతాపదీపిత, గగనధరాభాగుఁ డగుచు గడునొప్పారెన్.

9


చ.

అలనృపుధర్మపద్ధతి సమస్తజనుల్ ధనవంతు లౌటఁ గా
ల్నిలుపఁగఁ జోటులేక భువి లేములు లేమలబల్ పిఱుందుల
న్నెలచనుగట్లసందులను నెన్నడుసీమల నీఁగె భానుమం
డలరుచిఁ దూలి గొందుల నడంగిన చీఁకటికైవడిం దగన్.

10


ఉ.

ఆకుముదప్రియాన్వయుననాభ్యుదయంబున వర్ధమానలీ
లాకృతి నొప్పెఁ గీర్తులు మహార్ణవసప్తకలంఘనోద్ధతిన్
దాకొని చక్రపర్వతనితంబములం దదధీనభూమియుం
దాఁక నగుంజుమీ యని నిదానము ముందుగఁ దెల్పుకైవడిన్.

11


తే.

ఇవ్విధంబున సామ్రాజ్య మేలుచుండి, నిజభుజాబలవిస్ఫూర్తి నృపులకెల్ల
దెలియ దృష్టాంత మొనరింప దిగ్విజయము, సేయ నూహించి యారాజశేఖరుండు.

12


క.

అజహదహమహమికాపటు, భుజజభుజంగమవిహంగపుంగవధాటీ
నిజదండయాత్ర విజయ, ధ్వజపటకృతగగనచిత్ర దనరంగదలెన్.

13


సీ.

గంభీరవేదివిఖ్యాతిచేఁ దనరి సన్నాహ్యంబు లైనదంతావళములు
పంకింప శస్త్రనిపాతధీరంబులై వఱలునాజానేయవాహములును
నప్రతిహతసకలావయవంబులై యమరు హిరణ్మయస్యందనములు
సాంయుగీనప్రశస్తతఁ బెంపుమీఱిన శుష్మాతిశయభీష్మసుభటచయము


తే.

గమనధాటీచలద్ధరాకటకఘటద, పూర్వభరభరణశ్రాంతభుజగకమఠ
శైలదిగ్దంతుఁడై యేగెఁ జటులపటహ, ఘూర్ణితధ్వని దిశలు గగ్గోలుపడఁగ.

14

పురూరవుని జైత్రయాత్ర

శా.

ఆసన్నాహము చూడనొప్పెఁ బ్రకటాహంకారఘోరద్విష
త్త్రాసోత్పాదకపాంచధారవిచలత్కంఖాణసంఘాతరిం
భాసంఘట్టితగహ్వరీజనితరంగద్దూళిపాళిచ్ఛలో
ద్బాసాధీశమహామహదహనశుంభద్ధూమరేఖాంకమై.

15


తే.

అమ్మహీశ్వరు విజయయాత్రాధ్వసీమ, నవని చతురంగపదహతి నవనియయ్యె
రణితభేరీధణంధణంధణరవంబు, వినినయంతనె విమతులు విమతులైరి.

16