పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వంజులవంజులవంజులప్రథికంబు పాటలిపాటలిపరివృతంబు
మధురసామధురసామధురసారస్యంబు ఫలపూరఫలపూరబంధురంబు


తే.

దంతశఠదంతశఠవిచిత్రస్థలంబు, వీరతరువీరతరువారచారుతరము
వరసరశ్చయపూర్ణీభవత్సుధార, సౌరసకుమారవనము కుమారవనము.

107


ఉ.

కాంచి దృగంచలంబులు వికస్వరభాస్వరపుష్పపల్లవా
భ్యంచితసాలజాలములపై నెగఁ రాఁకఁగ నెమ్మదిం బ్రహ
ర్షించుచు నమ్మహాపపనసీమఁ జరింపఁదలంచి మించి రా
ణించు నిబద్ధరత్నధరణీసరణిం బటులీలఁ బోవుచున్.

108


ఉ.

ఏవనమైన దీనిసరియే గుఱియే మఱియెంచ నెంతయున్
బావన మంచితప్రసవబంధురగంధమిళిచ్ఛరత్కన
త్పావన మాశ్రితాన్యభృతబంభరకీరకపోతభోగిభు
క్సావన మీవనం బిది విహర్తకు జీవన మై యెసంగదే.

109


సీ.

దేవవల్లభనామధేయప్రసిద్ధినో యైరావతంబుపై నందగించె
బహులశాఖాంచితబ్రహ్మణ్య మగుటనో యొనరఁ గాయత్రీప్రయుక్త మయ్యె
గౌశికాభిఖ్యత గలుగుటనో శ్రేష్ఠసుమనోగణికఁ గూడి సొంపు మీఱె
హైమవతీసంజ్ఞ నమరుటనో మాధవీకృతసాంగత్యవృత్తి నెనసె


తే.

సానుగుణ్యంబులైన సమాగమముల, నలరె నిబ్భంగి నేతద్వనాగమంబు
లనుచుఁ జనుచుండి నిజవయస్యాళితోడఁ, బలికె నిట్లని మఱియు నృపాలసుతుఁడు.

110


తే.

స్యందనంబులు పున్నాగబృందములును, మావులును వీరతరు లగమ్యములు గలిగి
నలినమిత్రప్రకరముల కలవిగాక, తనరె వనసీమ యిది రాజధానివోలె.

111


తే.

కుసుమ మయ్యెనె వీనికిఁ గుసుమ మహహ, యీరసం బయ్యెనే వీని కీరసంబు
కాంచనము కాంచనమ్మగా నెంచుకొనవు, తలఁప మధుపంబులకు నెట్లు తెలివి కలుగు.

112


క.

కనుఁగొనుఁడు లతాంగీకృత, వినయాశ్లేషములఁ బొదలు విటపులు తగదే
కనుఁగొనఁగ లతాంగీకృత, వినయాశ్లేషములఁ బొదలు విటపులన వనిన్.

113


ఉ.

పొంకములై యెసంగె వనభూమిఁ గనుంగొనుఁ డూర్మికావళీ
కంకణభూషితంబులు వికస్వరహల్లకరాగరమ్యముల్
పంకజయుక్తముల్ సుకరభాంచితముల్ దరచక్రమత్స్యరే
ఖాంచితముల్ వినోదకమలాకరముల్ కమలాకరంబు లై.

114