పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాసామర్థ్యముఁ గల్గునే గతభవిష్యద్వర్తమానంబులం
దోసంక్రందన! యప్పురూరవునియ ట్లూహింప నెవ్వారికిన్.

205


తే.

సరసకరుఁడు సులక్షణచారుమూర్తి, భాన్వితుండు కళాకలాపాంచితుండు
కువలయాప్తుండు నుగ్రాంబకవిలసనుఁడు, నయ్యె నారాజు విష్ణుపదాశ్రయమున.

206


తే.

అతని నెమ్మోము పూర్ణసుధాంశుబింబ, మగుట సత్యంబు గాకున్న నగుట యెట్లు
వికచభావంబు నవరసవిభ్రమాభి, రామరామాంబికేందీవరంబులకును.

207


సీ.

పుండరీకదళాంతములయందు నందంబుగాఁ బద్మరాగరాగంబు నిలిపి
సమదవేదండతుండములందుఁ దీరుగా నిగనిగ మనుజిగి నెలవుకొలిపి
కుందనంపుఁబసిండియందుఁ దా ఘనసారసారసౌరభవిశేషంబు నించి
యరుణపల్లవములయందుఁ బద్యాంకుశకులిశాదిభాగ్యరేఖలు రచించి


తే.

చేసెఁ గావలె నలవాగ్విలాసినీశుఁ, డాకనుంగవ యాచేతు లాశరీర
మాపదంబులు గాకున్న నానృపాల, తిలకునంగకముల కింతచెలువుఁ గలదె?

208


ఉ.

కొందఱియందుఁ గొన్ని మఱికొందఱియం దొకకొన్ని గాని పెం
పొందుసమస్తసద్గుణము లొక్కనియందు ఘటించి యుండఁగా
నెందు నెఱుంగ మెవ్వరి సురేశ్వర! విష్ణుకళాప్తి నుద్భవం
బొందిన యప్పురూరవుని నొక్కనిఁదక్కఁగ మేదినీస్థలిన్.

209


చ.

అన విని వజ్రపాణి వినయంబున నారదమౌనిఁ జూచి యి
ట్లనియెఁ బురూరవక్షితితలాధిపుసద్గుణవర్ణనంబు నె
మ్మనమున కింపొనర్చె బుధమాన్య! సవిస్తరభంగిఁ దెల్పుమ
య్యనఘుఁడు విష్ణుభక్తుఁడు గదా విన నొప్పుఁ దదీయవృత్తమున్.

210


క.

ఎవ్వఁడు హరిభక్తిపరుం, డెవ్వఁడు సూనృతవచస్కుఁ డెవ్వఁడు సుజనుం
డెవ్వఁడు బహుజనపోషకుఁ, డవ్విమలునిచరిత మెన్ననగు వినఁగఁదగున్.

211


తే.

అనినఁ దత్పూర్వవృత్తాంత మన్నగారి, తోడ నమ్ముని వివరింపఁ దొడఁగె నప్పు
డమరగంధర్వవిద్యాధరాప్సరఃక, దంబకములకుఁ గర్ణామృతంబు గాఁగ.

212


క.

నారదనారదజోక్తిక, ధారాగ్రహణప్రయత్నతత్పరలీలా
సారంగీభూతశ్రుతు, లై రప్పుడు లేఖు లెల్ల నాసభలోనన్.

213


వ.

అని పలికినం బ్రహృష్టమానసులై తత్కథాప్రకారం బెఱింగింపు మని మహర్షులు
రోమహర్షణతనూభవు నడుగుటయును.

214