పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

కందరచనయందేకాక తక్కిన వృత్తములు రచించుటయందుఁ గూడ సూరన గొప్ప చతురుఁడని వాని కవిజనరంజన కావ్యమును బట్టి చెప్పవలసియున్నది. అందు ముఖ్యముగా శార్దూలవృత్తరచనలో సూరకవి రెండవ శ్రీనాథుఁడు. భాసురాలంకార పరిష్కృతములైన మదవారణముల కరణి నతని శార్టూలవృత్తములు వాని కావ్యకథావీథుల నతిగంభీరముగ సంచరించుచుండును.

శా.

శయ్యాదంభముసన్ మురాంతకుఁడు, భూషాకైతవస్ఫూర్తిచే
నయ్యార్యారమణుండుఁ దాల్తురు భుజంగాధీశులన్ నీయ సా
హాయ్యప్రస్ఫుటధాటి కోర్వ కనుచో నబ్జాస్యలా గెల్చు వా
రయ్యా గంధసమీర! ప్రోవఁగదవయ్యా యీకురంగేక్షణన్.

పద్యరచనయందుఁ గవికిఁ గల సామర్థ్యము యతిప్రాసలకూర్పు నేర్పునందే కొంత వెల్లడియగుచుండును. కవికిఁ గల రచనాచాతుర్యము పరీక్షించుట కీ యతిప్రాసలు గీటుఱాళ్ళు. కవిత్వతత్త్వమున నప్రతిమప్రతిభావంతుఁడైన సూరన యీరహస్య మెఱింగియే యతిప్రాసలం గూర్చి యీ క్రింది సూత్రములను గల్పించినాఁడు:

సీ.

యతియుక్త వాక్యానుగతి నంటవలయు వ
                  త్సంబు ధేనువువెంటఁ దవిలినట్లు
మెట్టు మీఁదను గాలు పెట్టఁ గైదండ యం
                  దిచ్చినట్టులు ప్రాస మెనయవలయు.