పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

తృతీయాశ్వాసము


మ.

కరమొప్పారు నిశానవోఢకు నిశాకాంతుండు మెల్మెల్లనే
కరము ల్సాఁచి తమోవినీలపట ముత్కంఠం దొలంగింప ని
ర్భరలజ్జం బతిమేనిపై ధవళవస్త్రంబు న్మెయిం గప్పుకొ
న్కర ణిం గ్రొందెలివెన్నెల ల్నిబిడమై కన్పట్టె నల్దిక్కులన్.

64


సీ.

కుముదినీజృంభణాంకురమూలకందంబు,
                  తోయజశ్రీపశ్యతోహరుండు,
సకలజీవంజీవసంజీవనౌషధి,
                  చక్రవాకీమనస్తాపకార,
తిమిరవారణఘటాసమదమృగేంద్రంబు,
                  చిత్తజమాంద్యవిచ్ఛేదనుండు..
నఖిలదిదృక్షుజనాసేచనకమూర్తి,
                  బహుళౌషధీప్రియంభావుకుండు,
సురలయాఁకటికూడు, మ్రుచ్చులకుఁ గీడు,
రిక్కలకు ఱేఁడు, వెలుఁగులయిక్కజోడు,
లచ్చిసైదోడు, రేబోఁటివెచ్చకాఁడు,
చంద్రుఁ డలరారె సత్కళాసాంద్రుఁ డగుచు.

65


క.

పొంగె బయోనిధు,లిరులు దొ
లంగెను, జక్కవలగమి కలంగె, మనములం
ద్రుంగె వియోగులధృతులు, చె
లంగెఁ జకోరము, విధూప లంబులు గరంగెన్.

66