పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

58


క.

అమరాధీశదిశాభా
గమునందలి తెల్ల యపుడు గనపించె రజ
స్యమృతమయూఖమిధస్సం
గమసముచితహంసతూలికాతల్ప మనన్.

59


గీ.

అంబుజభవాండ మను హజారంబులోన
నలరుఁగైదువపాదుషా యధివసింప
సమయభృత్యుఁడు పెట్టు కెంజాయపట్టు
బటువుబిళ్లనఁ జంద్రబింబంబు దోఁచె.

60


క.

అప్పుడు చంద్రుం డొప్పె
న్నిప్పులకుప్పవలె విరహిణీమండలికిం
జిప్పిల నమృతమునించిన
గొప్పపసిఁడికుండవలెఁ జకోరంబులకున్.

61


మ.

యామవతీవధూటి బిగియారం గవుంగిటఁ జేర్చుటం దదం
గామలచందనంబు మయి నంటె ననం దెలుపయ్యె బింబ మా
కోమలగాత్రిగబ్బిచనుగుబ్బలకస్తురి ఱొమ్ము సోఁకెనో
నామహిఁదత్కళంకము గనబడెఁ గల్వలఱేని కయ్యెడన్.

62


క.

తిమిరాపహృతికిఁ గ్రోధర
సము పూనె సితాంశుఁ డుదయసమయంబునఁ ద
త్తమ మెడల సహజధవళిమ
నమరెన్ ద్విజరాజ కోప మతిదీర్ఘంబే?

63