పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

తృతీయాశ్వాసము


నౌశీనరీవిలోకనవ్యగ్రపురంధ్రీవ్రాతంబగు సాకేతంబుఁ
బ్రవేశించి పుణ్యాహవాచనపూర్వకంబుగా గృహ
ప్రవేశమంగళాచారం బాచరించిన యనంతరంబ:


గీ.

నిజకులాలంకరిష్ణులై నెగడినట్టి
దంపతులశోభ నాగమోత్సవముఁ జూచి
యింటి కేగెడుగతి వాసరేంద్రుఁ డపుడు
చరమభూధరసానుదేశమున కొఱఁగె.

43


గీ.

అంత కంతకు దీర్ఘంబు లగుచు జగతి
నిగుడునీడలతోడనే నిగుడసాగెఁ
జక్రవాకావళీమానసవ్యథలును
బాంథజనకామినీనేత్రబాష్పములును.

44


క.

కొలఁకులఁ దమ్ములతోడన
నెలవుల నానావియోగినీసంఘాత
మ్ముల కనుదమ్ములు మొగిడెను
జలజాప్తుఁడు చరమశైలసానువుఁ జేరన్.

45


క.

జరఠారుణశోణకిరణ
పరంపరలు సాగె ధాత్రి పైని రథాంగో
త్కరముల మనములఁ జేరెడు
స్మరపావకశిఖ లనంగ సాంద్రం బగుచున్.

46