పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

తృతీయాశ్వాసము

శ్రీకాళికామనోహర,
లోకత్రయరంజనైక లోలుపహృదయా,
యాకాశకేశ, వందిత
నాకేశా, రామచంద్రనగరనివేశా!

1


వ.

అవధరింపుము:


క.

సంతసముఁ జెంది భూసురుఁ
డంత న్విజయాస్పదమున కరిగి ధగిత్రీ
కాంతునిఁ బొడఁగాంచి శుభో
దంతము వినుచుటయు నతఁడు హర్షముఁ జెందెన్.

2


వ.

అంతఁ జంద్రమతికిఁ దద్వృత్తాంతం బెఱింగించి,


క.

అమితోత్సాహంబునఁ జం
ద్రమతీకల్యాణవార్త ప్రజ లెఱుఁగఁగ భూ
రమణుం డాస్థాననివే
శమునం బ్రస్థానభేరి సఱువంబంచెన్.

3


వ.

అప్పుడు ప్రధానులం బిలిపించి వీడుగై సేయించి వివాహ
యోగ్యద్రవ్యంబులు సమకూర్చునది యని యానతి
చ్చిన,