పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

26


సీ.

ఎలనాగపల్కుల కెన గావటంచునో
                  చెవియొగ్గి వినఁడయ్యెఁ జిలుకపల్కు
లింతినెమ్మోముతో నీడుగాదంచునో
                  తళుకుటద్దముఁ జూడఁ దలఁపఁ డయ్యెఁ;
బూఁబోఁడిబాహులఁ బోలలే వంచునో
                  పూవుదండలు మేనఁ బూనఁడయ్యెఁ;
బొలఁతి మైతావితోఁ బురుడుగా దంచునో
                  మొనసి శ్రీగంధంబు ముట్టఁడయ్యె;
బోటినిట్టూర్పుగాడ్పుతో సాటిగా ద
టంచునో యుశీరతాలవృంతానిలంబు;
సొంపునకు నించుకేనిఁ గాంక్షింపఁడయ్యె
మదనసాయకఖిన్నుఁడై మనుజవిభుఁడు.

14


గీ.

తత్కథామృతసేవనతత్పరతను
నృపతిచిత్రవిలోకనానిమిషవృత్తిఁ
దెఱవ యాహారనిద్రలు మఱిచిపోయె
నితరభోగపరిత్యాగ మెన్ననేల?

15


గీ.

మేను గృశియించె ధైర్యసమృద్ధితోన,
కాలమును వింతతోన దైర్ఘ్యము వహించె
గాలి వేఁ డయ్యె నిట్టూర్పుగాడ్పుతోన,
విరహసంతాపభరమున వెలఁది కపుడు.

16