పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

ద్వితీయాశ్వాసము


సీ.

సరసోరుకదళికాస్తంభంబులను మించి
                  శుభకరపల్లవస్ఫురణ నెగడి,
పృథులకుచంబులఁ బెంపొంది చారుచం
                  పకకలికాతనుప్రభలఁ దనరి,
యనుపమసుమమాలికాభిరూప్యముఁ దాల్చి,
                  రాచిల్క పల్కుల రహి దనర్చి,
భ్రమరకనీలశోభామంజిమ వహించి,
                  పలుమల్లెమొగ్గలఁ బరిఢవిల్లి,
తిలకరుచిఁ బొల్చి, మోవికాంతిని జెలంగి,
పాపటఁ బొసంగి, యామోదభరము నించెఁ,
జూపఱకు నెల్ల వనలక్ష్మి సొంపెలర్ప
నభినవంబైన యా వసంతాగమమున.

12


వ.

ఇట్లు త్రిలోకీమనోహరంబైన వసంతంబు ప్రవర్తిల్లిన
నయ్యాదిమసార్వభౌముండు.


గీ.

పటునవద్వయద్వీపసంప్రాప్తి గాంచి
విమలచంద్రమతీకటిద్వీపవాంఛ
వెట్టె నపుడు త్రిశంకుభూవిభుసుతుండు
గలదె ఫలతృప్తి వసుమతీకాంతులకును?

13