పుట:కవికర్ణరసాయనము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పద్మినీభోగలబ్ధసంస్పర్శనమునఁ, గలితమైనపరాగరాగమునఁ బోలె
భానుకరములు దివసావసానసమయ, సమధికోత్ఫుల్లపల్లవచ్ఛవి వహించె.

64


చ.

వెనుకొనుదృక్పరంపరలవెల్లువలన్ బతితాభిసారికా
జనములు త్రోవఁ ద్రోవ నలచక్రయుగంబులు గాతరావలో
కనములఁ ద్రిప్పఁ ద్రిప్పఁ జనఁ గ్రమ్మఱ నేరక పోలెఁ బశ్చిమా
వనిభృదధిత్యక న్నిలిచె వారిజబాంధవబింబ మయ్యెడన్.

65


తే.

తొంటితేజంబు దూలినఁ దూలనిమ్ము, కాలగతి దాఁట శక్యంబె ఖరకరునకుఁ?
జాలదా భాగ్య మిది? యెల్ల జగము మ్రొక్కె, నస్తసమయవేళ నుదయంబునందపోలె.

66


చ.

చరమధరాధరాగ్రమునజాఱెడువేళఁ బతంగుఁ డంగజ
త్వరితమనస్కమై నిలిచి తన్నుఁ గనుంగొనుసౌధశేఖరో
పరితరుణీజనంబుముఖపద్మములన్ వికసింపఁ జేసె స
త్పురుషులు తారు దుర్దశలఁ బోవుచు నైననుఁ బ్రోతు రాశ్రితున్.

67


తే.

అహిమభానుండు చనుదేర నస్తశిఖరి, సరవి నర్చించుకుంకుమాక్షతము లయ్యెఁ
బరిణతాతపసంధానభాసమాన, శిఖరసానుఝరోద్ధూతశీకరములు.

68


ఉ.

క్రొత్తగ దీర్ఘికానికటకుంజగృహంబులఁ దల్పకల్పనా
యత్తము లైనమత్తకరు లాత్మకరాగ్రము లెత్తి పల్లవో
పాత్తమనస్కత న్వెరఁజి యాడఁగఁ జొచ్చెఁ బరిభ్రమించుభూ
భృత్తరువాటికావిటపబృందమిళజ్జరఠాతపంబులన్.

69


వ.

అప్పుడు.

70


సీ.

మొగడలబిగివీడుతొగల నంకూరించు, క్రొత్తనెత్తావి మూర్కొనుచు నులుకు
నిష్ప్రభం బై నీట నీడఁ దోఁచినభాను, బింబంబు గని భీతి బీఱువోపు
బాష్పంబు చూడ్కిఁ గప్పఁగఁ గూడి యుండియు, వికలకంఠముగ నొండొకటిఁ బిలచుఁ
గసిగాటు గఱచినబిసనాళములఁ జంద్ర, కరశంక సంధిల్లి మరలఁ గ్రాయు


గీ.

నీడ లను బుద్ధి నొండొంటిఁజూడ కనలి, నీడ లొండొంటిఁగాఁ జూచి కూడ నరుగు
భావివిరహవ్యధాభయభ్రాంతివలన, శోకపరవశ మై చక్రవాకయుగము.

71


ఉ.

కుత్తుక లెత్తి బిట్టులికి క్రుంకురవిం గని దీనవృత్తితో
నొత్తినభావిదుర్భరవియోగభరంబున నొండొకంటిమో
మత్తమిలం గనుంగొనురథాంగయుగంబుల దృష్టి గప్పుఁ బో
మిత్తుగఁ గన్నునీ రొదవి మించినచీఁకటికంటె మున్నుగన్.

72


ఉ.

ఆంతరభక్తి మజ్జనకరాష్ట్రము లబ్జములు న్ముణుంగఁ గాఁ
గాంతులరాక నంగనలకన్నుఁదొగల్ తొగలున్ దలిర్పఁ గా