పుట:కవికర్ణరసాయనము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గుచ్ఛంబులనుకంటెఁ గుధరంబులనుకంటె, నిఱిజక్కవలఁ బోల్ప నిప్పు డొనరు
నద్దంబులనుకంటె నమృతాంశుఁడనుకంటె, నెలదమ్మిగమిఁబోల్స నిపుడు దగవు


గీ.

నాఁగఁ బొలిచి రంగనలు నీటియాటల, కెచ్చరించి తఱియునెడఁ గొలఁకుల
తోయసంగమమునఁ దొడలను బిరుదుల, వలిచనుంగవలను వదనములను.

43


చ.

అమితవిలాసినీకుచరథాంగకసంగతి గల్గ దీర్ఘికా
సముదయ మప్పు డాత్మగతచక్రయుగంబులఁ బాయఁ ద్రోచెఁ బ్రాం
తములకుఁ దత్ప్రదేశసవిధాతరళోర్మిభుజాపరంపరన్
దమ కొకమేలు గల్గ దిగఁ ద్రావరె యాశ్రితులన్ జడాశయుల్?

44


చ.

కువలయపత్రనేత్ర యొకకుంభమ చాలుఁ దరింపఁజేయ ని
కుమ నీ కయత్నకుచకుంభయుగం బది గల్గ నిందనే
రవె? భయ మేల? రమ్మని కరంబుల నీడ్చిన వ్రాలుభీరువున్
వివృతభుజాంతరస్థలనివేశితఁ జేసెఁ బ్రియుండు నవ్వుచున్.

45


క.

నిలువున నీఁదుచు రమ్మీ, కొలఁదియ యన నేగి మునుఁగుకొలఁదిన యిరుచే
తులఁ బట్టి యెత్త భయమునఁ, గలకంఠి యొనర్చె విటునికంఠగ్రహమున్.

46


తే.

ఇంతిదరినుండి చివ్వున నెగసి యుఱుక, నురువుకొని నీరు వలయ మై పొరలి విరియ
నడుమ నుదయించెఁ జక్కనినగుమొగంబు, మధ్యమానాంబునిధిఁ జందమామవోలె.

47


తే.

ఒత్తిగిలి యీఁద నీటిపై నొంటిఁ దోఁచు, కొమ్మవదనాంబుజముపొంత కుచము గాంచి
కవదొఱంగినచక్రవాకం బొకండు; తోడిప్రియసతి యని ప్రీతిఁ గూడుకొనియె.

48


చ.

అలరి యొకింతమాఱుమొగ మై యఱచేతుల నొగ్గికొన్న న
చ్చలమునఁ గాముకుండు పయిఁ జల్లెడునీటిమెఱుంగుఁదుంపరల్
చెలువచనుంగవన్ బొలిచెఁ జేరి తదీయనఖాంకచంద్రులన్
గొలిచి వినూతనద్యుతులు గొల్పెడుతారకపఙ్క్తులో యనన్.

49


క.

అనులేపనములు గరఁగిన, చనుఁగవల నఖాంకురములు సతులకుఁ దగునా
ననపూర్ణవిధులవలనను, ఘన మై జాఱిపడి యొప్పుకళలో యనఁగన్.

50


ఉ.

చల్లెడునీటిపై మలయజంబు గరంగిన నింతిచన్నులన్
బల్లవితోరుకాంతి గనుపట్టెడుకెంపులు చూచుశంకమైఁ
బల్లవుఁ డొక్కఁ డివ్వలిసపత్నిమొగంబున నీరుతోడుతో
గళ్లుపడ న్వడిన్ బెడమొగం బగునట్లుగఁ జల్లె నార్చుచున్.

51


తే.

ధవుఁడు చల్లెడుకరవారిధార లెట్టు, లోర్చెనో కాని తరలాక్షియొద్ద సవతి
తత్కుచాఘాతఘట్టనోత్పతిత మగుచు, నొక్కతుంపర పైబడ్డ నోర్వ దయ్యె.

52