పుట:కవికర్ణరసాయనము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

సిగ్గునకుం బికాపికలు చిత్తసమున్నతిపేరివార్తకుం
గగ్గులకాళ్లు శంకలకుఁ గన్కనియెగ్గులఁ బుట్టువల్కకు
న్సగ్గిసముగ్గిసల్ నిలుపుసైరణకు న్గననీనియెత్తికో
ళ్లగ్గజయానకుం బతికి నయ్యె యథేష్టరహఃప్రసంగముల్.

229


చ.

అలిగినవేళ వయ్యెడినిజాంగజతాపము పేరియెండలున్
గలసినవేళ నయ్యెడిమొగంబులనవ్వులపేరివెన్నెలల్
దలఁచుటె కాని యవ్విభుఁడు దన్వియు సంతతకేలిలోలతన్
దలఁప నెఱుంగ రెన్నఁడు దినంబులయెండలు రేలవెన్నెలల్.

230


సీ.

మాధవీమధుపానమత్తాలినీగాన, విభవాకులోద్యానవీథికలను
జంద్రికానిర్ధూతజలదపథోపేత, శశికాంతకలధౌతసౌధములను
గాదంబినీజాలకలకలవాచాల, శైవలినీలోలసైకతములఁ
గలితలీలాయత్నకల్పితగిరినూత్న, కాంతి నానారత్నకందరముల


గీ.

మఱియు వివిధవిహారైకమందిరముల, నిచ్చనిచ్చలు గ్రొత్తలై యెచ్చరించు
ఖేలనంబులఁ దెప్పలు దేలుచుండె, నెలఁతయును దాను మాంధాతృనృపవరుండు.

231

ఆశ్వాసాంతము

ఉ.

ఆర్తిక్షీణగజేంద్రరక్షణ కళావ్యాఘాతవిఖ్యాతిమ
త్కర్తృత్వ ప్రతిమల్ల పల్లవసతీకౌమారహారక్రియా
ధూర్తాగ్రేసర సహ్యసంభవ లసద్వ్యూఢాంతరంగస్థలీ
మూర్తోస్మద్విధభాగధేయ శరదంభోజాతపత్రేక్షణా.

232


క.

డోలాలీలాందోళన, ఖేలాస్వగతాగతాభివీక్షణజనితో
ద్వేలప్రమదాంబుధిక, ల్లోలప్లవదస్మదాదిలోకస్వాంతా.

233


భుజంగప్రయాతము.

అభద్రాంధకారోదయద్భానుభావా, శుభైకాశ్రయీభూతశుద్ధస్వభావా
యభక్తావళీదృష్ట్యహఃకాలతారా, స్వభక్తాగ్రభూపారిజాతావతారా.

234


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరోజసేవకోపసేపక నరసింహనామధే
యప్రణీతం లైనకవికర్ణరసాయనం బనుకావ్యంబున నాయికానిరూపణంబును, యౌ
వనవర్ణనంబును, విప్రలంభంబునందు దశదశానిరూపణంబును, వివాహంబును, నవో
ఢాసంగమంబు నన్నది తృతీయాశ్వాసము.