పుట:కవికర్ణరసాయనము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

బలిమి రసాతిరేకమునఁ బయ్యదకొం గెడలింపఁ గంపముం
దళుకును గల్గుతొల్కరిఁ గనంబడు క్రొత్తమెఱుంగుఁబోలె న
ప్పొలఁతిమెఱుంగుమేనదియు భూవరుతాల్మి మరుండుఁ దెంపఁగా
బెలుచ నొర న్వెడల్చి జళిపించుకృపాణిక యయ్యె నయ్యెడన్.

214


క.

కొల్లలు గో నఱ్ఱాడెడు, వల్లభుదృఙ్మధుపతతుల వ్రాలఁగనీ కు
త్ఫుల్లకుచగుచ్ఛములఁ గర, పల్లవపుటయుగళిచేత బాలిక పొదివెన్.

215


తే.

కంకణక్రేంకృతులపేరఁ గలహ మాడి, యధిపుకరములతో బాలహస్తయఁగము
సరిఁ బెనంగఁగ నా కేల జగడ? మనుచు, జాఱు గతి నీవి తనుఁ దానె జాఱె సతికి.

216


తే.

పయ్యెద బలము దూలినఁ బణఁతి బాహు, శక్తిఁ గుచదుర్గములఁ గాచి జాఱునీవిఁ
బట్టఁబోయిన రాజు చేఁ బడియె రెండు, భేదమున నెంతకార్యంబు గాదు తలఁప?

217


తే.

ముగ్ధ యగుఁ గాక యే? మింత ముగ్ధ గలదె? బాల జఘనాంశుకం బింక గోల పెనఁగ?
రాజవరునకు రోజదుర్గములు రెండుఁ, జేపడియె నట్టె యిఁకఁ గ్రిందిసీమ యెంత?

218


క.

ఒడిసి జఘనాంశుకం బపు, డెడలించినవిభునిదృష్టి కెడయీనిమతిన్
బడఁతుక లజ్జావశమునఁ, గడువడితోఁ బొదివి బిగ్గఁ గౌఁగిటఁ జేర్చెన్.

219


ఉ.

చూడనిచూడ్కియు న్బలుకఁ జూడనివాక్కును గౌఁగిలింపఁగాఁ
జూడనికేలుగంటి యిడఁ జూడనిమోవియు మాఱుసేయఁగా
జూడనిచెయ్వుఁ బైకొనఁగఁ జూడనికాయముఁ గల్గి తోల్తొలిన్
జేడియసంగమంబు నృపుచిత్తముఁ దత్తఱ పెట్టె నింపునన్.

220


చ.

వెఱపు నలంతికంపమును వీడనివ్రీడయు మాఱుసేయఁగా
నెఱుఁగమి యేపులేమి పరియెత్తెడుచొక్కులగోలు ముందుగా
మఱుపుమొగంబు నోరయును మాటుగ ఱెప్పలఁ గప్పుచూడ్కియుం
దెఱవ నవాగ్రసంగతిఁ బ్రతిక్రియ లై యలరించె భూవిభున్.

221


సీ.

కేలితోఁ గేలు కెంగేలఁ గీలించుచోఁ, బులకోద్గమము వెంట వెలువరించి
యెయ్య నొయ్యన మీఁదిపయ్యెదఁ దివియుచోఁ బొడము కంపములతో నెడలఁదూలి
కడునించుమెత్తనికౌఁగిటఁ జేర్చుచోఁ, గ్రమ్ములేఁజెమటలఁ గరఁగ జార్చి
మరపించి యెల్లనిమర్మంబు లంటుచోఁ, బుణికిళ్ల నెళవులు పుణికి వైచి


గీ.

పలుదెఱంగుల మదిసిగ్గు వెలితిపఱచి
దినకరాన్వయుఁ డొకకొన్నిదినములకును
బొలఁతియెడఁ బూన్కి కొడఁబాటుపొందుఁ గాంచె
నిగ్రుచుకోర్కులఁ దనడెంద మివతళింప.

222