పుట:కవికర్ణరసాయనము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంతలేశునెడఁ జిత్రకారులు మాంధాతగుణములు వర్ణించుట

మ.

అరవిందప్రతిమల్లఫుల్లనయనుం డాజానుబాహార్గళుం
డరతోత్తాలవిశాలవక్షుఁడు సమగ్రాకారలోకైకసుం
దరుఁ డుల్లోకవిచిత్రతేజుఁ డిల మాంధాతృక్షమామండలే
శ్వరుఁ డాతం డొకరాజమాత్రుఁ డటె సాక్షాద్విష్ణుఁ డూహించినన్.

60


క.

అతనిఁ గనుఁ గొన్నచూపుల, నితరమహీపతులు సృష్టి నెంతటితేజో
యులు లేవి సూర్యుముండటఁ, బ్రతిదీపము లట్ల యతఁడు ప్రభుమాత్రుండే?

61


క.

నీకన్య కతఁడు దగు నా, భూకాంతాగ్రణికి నీదుపుత్రికయ తగు
న్మాకుం దోఁచినమత మిది, టీకలు పదివేలు నేమిటికి నిప్పటికిన్.

62


క.

అతిమానుష మైనతద, ద్భుతతేజము వ్రాసి చూపఁ బోల దతనియా
కృతిమాత్ర మచటఁ జిత్రిం, చితి మిదె యని చూపఁ జూచి చిత్తం బలరన్.

63


వ.

కుంతలేంద్రుండును వారలు పలికినంతకు నిక్కం బగుటకు మెచ్చి పారితోషికం బొసంగి
యనిచినపిదప విమలాంగికిం బ్రియవయస్యయుఁ బ్రోడయు నగుపాలిక యనుశు
ద్ధాంతచారిణి రావించి నిజప్రారంభంబునుం జిత్రకారాభిప్రాయంబునుం దెలిపి తత్త
ద్దేశనగరనగనదీవిహారప్రదేశవిశేషంబులతోఁ గులగోత్రచరిత్రనామాంకంబులతో య
థారూపంబులతో నిందుం జిత్రింపనిరాకుమారుండు సర్వంసహాచక్రబునం గలుగం
డీనృపనందనసందోహంబు మదీయనందన డెందంబు గందళింపంజేసినయనురూపభూప
కుమారునిం దెలిసికొని రమ్మని యాజ్ఞాపించినం బనిపూని చని యక్కుమారికకు నా
సంతోషం బెఱింగించి యచ్చిత్రచిత్రపటంబు విప్పి చూపునపుడు.

64


ఉ.

పాలిక చూపఁగా నవనిపాలతనూభవ సూచె దేశత
చ్ఛాలనదీవనీనగరసత్కులనామయశస్సనాథులం
గౌళకళింగవంగకురుకాశకరూశవిదేహచోళపాం
చాలవనాయుసింధుముఖసర్వమహీవలయాధినాథులన్.

65

విమలాంగి మాంధాతం జిత్రపటమునఁ గని మోహించుట

గీ.

చూచి యెవ్వనిఁ గైకోక సుదతి యంతఁ, జూచె డెందం బెనసి యెత్తఁ జూడ్కి నాఁట
గుణవినిస్తంద్రు నుత్తరకోసలేంద్రు, నిరుపమాకారు యువనాశ్వనృపకుమారు.

66


శా.

ఆకంఠప్రణయప్రమత్తము లపూర్వాశ్చర్యనిష్యందము
ల్సాకూతాయతపాతము ల్సుఖవిశేషాంతర్ముహుర్ముగ్ధముల్
హ్రీకోణాంచలచంచలాలసవశప్రీతిప్రసాదోదయ
వ్యాకోచంబులు నైనవీక్షణముల న్వామాక్షి సూచెం బతిన్.

67