పుట:కవికర్ణరసాయనము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరకృతిపతిత్వగర్హణము

సీ.

ఆందోళికలయందు నంతరచరు లైన, సవికృతాకృతుల పిశాచజనులు
పరకరాళంబు లై ప్రార్థింపఁ గనుఁగోక, వాయెత్తకుండుజీవచ్ఛవములు
వాలవీజనములఁ గ్రాలుచు నీఁగకు, నంటీవిఖరవర్తులాండసములు
వేత్రపరంపరావిలకంటకాకృతిఁ, జేరఁబోరానిబర్బూరతరులు


గీ.

శంఖనాగస్వరస్వరశ్రవణసమద, విస్ఫుటచ్ఛత్రవిస్ఫారితస్ఫటాక
విష్టవిషవైద్యవశవర్తిదుష్టఫణులు, ప్రభుదురాత్ముల నెవ్వాఁడు ప్రస్తుతించు.

24


వ.

అదియునుం గాక.

25


గీ.

నరగుణాంకితమయ్యెనే సరసకృతియు, దూష్య మగు శునిధృతగతదుగ్ధమట్లు
హరిగుణాంకిత మయ్యె నే నసదుకృతియు, హారసూత్రంబుగతి హృదయంగమంబు.

26

కృతినాథరంగనాథప్రశంస

సీ.

జగదేకపతి యయ్య సకలాభిగమ్యుండు, సర్వశాసకుఁ డయ్యు సదయహృదయుఁ
డభిమతప్రదుఁ డయ్యు నంజలిసాధ్యుండు, పరిపూర్ణుఁ డయ్యును బ్రణతికాముఁ
డతిగతేంద్రియుఁ డయ్యు ననిమిషదృగ్దృశ్యుఁ, డనియోజ్యుఁ డయ్యు భక్తానుయాయి
సాక్షి యయ్యు సుతాపచారానభిజ్ఞుండు, సముఁ డయ్యు నార్తరక్షాపరుండు


గీ.

భద్రగుణనిధి దుర్గుణప్రతిభటుండు, సముఁడు నధికుండు లేనియుత్తమపురుషుఁడు
వెదకి చూచిన శ్రీరంగవిభునివంటి, ప్రభువు నత్యంతసులభుండు ప్రభువు గలఁడె.

27


శా.

జ్ఞానప్రౌఢమహాకవీశ్వరవచస్సంస్తూయమానుండు ల
క్ష్మీనాథుండు మదల్పవాక్యరచనాస్వీకర్త గాకుండునే?
నానాభూపతు లెల్లఁ గానుకలు రత్నశ్రేణు లర్పింపఁగా
దానాముష్టిముచుం గుచేలుఁ గరుణన్ ధన్యాత్ముఁ గాఁ జూడఁడే.

28


వ.

అని సకలలోకనాయకుం డైన శ్రీరంగనాయకుం డాకృతినాయకుండుగా నిశ్చయించి
మొదలం గృతిముఖాలంకారంబుగాఁ గృతినాయకుదివ్యావతారక్రమం బభివర్ణించెద.

29

శ్రీరంగనాథదివ్యావతారవైభవము

సీ.

మున్ను కల్పాది నంభోజనాభునినాభి, నలినగర్భంబున నలువ పుట్టి
యఖిలైకమూలంబు లైనవేదంబుల, నతనికృపాలబ్ధి నధిగమించి
శబ్దానుసారి యై జగ మెల్ల సృజియించి, పరికించి యింద్రాదిపదములెల్ల
నాత్మాధికారంబు నస్థిరం బని కాంచి, నిర్విణ్ణుఁ డై మోక్షనిత్యసుఖము


గీ.

పరమపురుషప్రసాదసంప్రాప్య మనియుఁ, దత్ప్రసాదంబు తత్పదద్వంద్వభజన
సాధ్య మగుటయు వేదాంతసరణి నెఱిఁగి, తపము గావించె దుగ్ధాబ్ధితటమునందు.

30