పుట:కవికర్ణరసాయనము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఒండువిలు సాలమిని వే, ఱొండొకవి ల్లెత్తి చాలకుండినఁ బైఁ బై
నొండొండఁ బూనఁ గార్ముక, దండంబులు పదియు నయ్యె దశకంఠునకున్.

219


క.

వదలక విభుఁడును వివిధ, ప్రదరంబుల వెల్లిగొలుపఁ బటు వగుదీప్తుల్
పొదిగొన్నవేళ నింగియుఁ, దుది నేమని చెప్ప నంపదొన యై తోఁచెన్.

220


సీ.

భూరితరంగితాంభోధి యై క, నుపట్టు నురగకులంబుచే నొక్కమాటు
నికటకాంచనరాజీవకషోపలముఁ బోలు, నురుగరుత్మత్కాంతి నొక్కమాటు
కాచపాకక్రియాకరకుటీరముఁ బోలు, హుతవహజ్వాలల నొక్కమాటు
చటులమహావటక్ష్మారుహంబును బోలు, నుదకధారలచేత నొక్కమాటు


గీ.

నభము చూపఱ కిట్ల మాంధాతృమనుజ, నాయకుండును రాక్షసనాయకుండు
నిగిడి పన్నగమారుతాగ్నేయవారు, ణాదిదివ్యాస్త్రములఁ బోరునాహవమున.

221


చ.

ఉడుగక పెద్దకాల మిట లొండొరు గెల్వఁగ లేక కోపము
ల్విడువక పోరిపోరి తుద వేసరి దైత్యుఁడు చంద్రహాసముం
బుడమివిభుండు పాశుపతము న్వడిఁ బూనిన మ్రొగ్గె దిక్కరు
ల్జడధులు ఘూర్ణిలెం బెకలె శైలను లల్లల నాడె లోకముల్.

222

శివుఁడు ప్రత్యక్షమై యుద్ధమును మాన్పుట

గీ.

అంధులై చేయునది లేక యమరు లింకఁ, ద్రుంగెఁ భో విశ్వ మింతటితోడ ననఁగ
నంతలోనన వారలయంతరమున, నలికనేత్రుండు ప్రత్యక్ష మగుచు నిలిచె.

223


శా.

ఓహో! చాలుఁ బురే! మహాహవము మీకొండొక్కరుం దక్కఁగా
బాహాహంకృతి యెందు వేఱ సరి చెప్పం గాన మీ విశ్వని
ర్దాహక్రీడకు మిమ్ముఁ బంపిడితినే? తప్పయ్యె మీ కీజగ
ద్ద్రోహం బేటికిఁ బొండు మీరిరువురుం దుల్యప్రభావాధికుల్.

224


గీ.

అనిన హరునియాజ్ఞ కసురేంద్రుఁ డట్లకా, సమ్మతించె విభుఁడు సమ్మతిలక
యహితుమీఁదికోప మారక భువనంబు, తలఁక భవునిఁ జూచి పలికె నపుడు.

225


క.

నిను దశశిరములఁ బూజిం, చినవాఁ డని కాదె వీనిఁ జేపట్టితి? వే
నును నీమది కెక్కినయీ, తనితలలం ద్రుంచి నిన్నుఁ దగఁ బూజింతున్.

226


వ.

అనుటయు.

227

శివుఁడు మాంధాతకు విజయము నొసంగుట

ఉ.

మెచ్చి హరుండు రాజ! వినుమీ యొకమాట మదంఘ్రిభక్తిసం
పచ్చరితార్థుఁ డీయసురభర్త నిసర్గబలాధికుండ వీ
విచ్చితి నీక యజ్జయము నింతియ కాదు వరంబు నొక్క టే
నిచ్చితి నిన్ను నెవ్వఁడు జయింపఁడు పొమ్ము జగత్త్రయంబునన్.

228